రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
32 వ డివిజన్ 228 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : పేదల ఆర్థికాభివృద్ధే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 32 వ
డివిజన్ 228 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, అధికారులతో
కలిసి ఆయన పాల్గొన్నారు. డొంక రోడ్డు, బుడమేర కట్ట రోడ్డు, పలగాని ప్రభాకర్
వీధి, రామాలయం వీధులలో విస్తృతంగా పర్యటించి 215 ఇళ్లను సందర్శించారు. ఈ
సందర్భంగా ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ ఇంటికి
విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు.
పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి సహకారంతో గత మూడున్నరేళ్లలో ప్రజలకు మంచి చేశామని మల్లాది విష్ణు
తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు పేదల
ఉన్నతికి దోహదపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి
వర్తించిన సంక్షేమ పథకాల బుక్ లెట్ లను అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుతో
పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజల ముందుకు వచ్చినట్లు
మల్లాది విష్ణు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చిత్తశుద్ధిలేని యాత్రలను ప్రజలు నమ్మరు
చిత్తశుద్ధిలేని నేతలు చేసే పాదయాత్రలను ప్రజలు ఎన్నటికీ విశ్వసించరని
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. కేవలం ఉనికి
కోసమే నారాలోకేష్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి
ఉంటే గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదలకు చేసిందేమిటో లోకేష్ తన యాత్రలో సమాధానం
చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన ప్రజలకు ఏమాత్రం
ఉపయోగపడలేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి పాలనకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని.. ఏ ప్రాంతానికి
వెళ్లినా తమ ఇంట్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారనేది లబ్ధిదారులే ముందుకొచ్చి
చెబుతున్నారన్నారు. అదే గత టీడీపీ పాలనలో పేదల ఆరోగ్యం, వ్యవసాయం, యువతకు
ఉద్యోగాలు.. ఇలా ఏ ఒక్కటి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు,
వెంకటేశ్వరరెడ్డి, లింగాల శ్రీనివాస్ రావు, శ్యామ్, అబ్రహాం, లక్షణ, శరత్
చంద్ర, సాంబశివరాజు, వాసు, త్రివేణిరెడ్డి, బెజ్జం రవి, భోగాది మురళి, ఇతర
నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.