26 వ డివిజన్ 28 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 26 వ డివిజన్ 28 వ వార్డు
సచివాలయ పరిధిలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు
గొల్లభామ, కోఆర్డినేటర్ కోలా నాగాంజనేయులుతో కలిసి శుక్రవారం గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కాకానీ నగర్, సర్దార్ పటేల్ రోడ్డు,
కాకర్ల వారి వీధిలో విస్తృతంగా పర్యటించి 214 గడపలను సందర్శించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా
ఉన్నారని మల్లాది విష్ణు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ
పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబులా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల
ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసినట్లు
వివరించారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యలతో పాటు
ప్రభుత్వ పథకాల అమలు, అధికారులు, సచివాలయ సిబ్బంది సకాలంలో సహకరిస్తున్నాదీ
లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పింఛన్ లపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పేద ప్రజలకు పెద్దఎత్తున
జరుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక పింఛన్లపై ప్రతిపక్షాలు విష ప్రచారం
చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. పింఛన్లపై మాట్లాడే ముందు.. టీడీపీ
హయాంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయో ఆ పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని
సూచించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే రాష్ట్రంలో 43.11 లక్షల
మంది పింఛన్లు పొందుతుండగా.. 2014 సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన
జన్మభూమి కమిటీల తనిఖీలతో కోతలు విధించి 39 లక్షలకు కుదించింది వాస్తవం
కాదా..? అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో 17,232 మాత్రమే
ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25,405 కు పెంచడం
జరిగిందన్నారు. గతంలో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 8 వేలు అధికమని తెలియజేశారు.
అలాగే పింఛన్ అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా
ఎన్నో లక్షల మందికి నూతన పింఛన్లు తీసుకునేందుకు అవకాశం ఏర్పడిందని మల్లాది
విష్ణు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63.14 లక్షల మంది ప్రతినెలా రూ. 1,740
కోట్లు పింఛన్ రూపంలో అందుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో టీడీపీ వాళ్లు
ఇచ్చిన పింఛన్లు, సీఎం జగన్ ఇచ్చిన పింఛన్లను పరిశీలిస్తే ఏ ప్రభుత్వానికి
ఎక్కువ ప్రేమ ఉందో తెలిసిపోతుందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ప్రజలంతా
జగనన్న పాలనను శభాష్ అంటూ కీర్తిస్తుంటే.. చూసి ఓర్వలేనితనంతో పచ్చ నేతలు
విమర్శలు చేస్తున్నారని, ప్రజలందరూ దీన్ని తిప్పికొట్టాలని కోరారు.
కార్యక్రమంలో డీఈ(వాటర్ సప్లై) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ
జగదీశ్వరి, నాయకులు బాడిద అప్పారావు, పారా ప్రసాద్, పిల్లుట్ల వంశీ, సుధాకర్,
అన్సారీ బేగ్, ఎం.శ్రీనివాస్, బాడిత సత్యవతి, పసుపులేటి భవానీ, బెజ్జం రవి,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.