విజయవాడ : పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా తమ ప్రభుత్వం
ముందుకు వెళుతోందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ
పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్
అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన
పాల్గొన్నారు. ప్రజాశక్తి నగర్, రాధానగర్లలో విస్తృతంగా పర్యటించి.. 241
గడపలను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ
సారథులు, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి.. ప్రభుత్వం ద్వారా వారి
కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాల కరపత్రాలను అందజేశారు. ఏమైనా
సాంకేతిక కారణాల వలన పథకాలు అందకపోతే వారికి న్యాయం చేయడానికే గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత చంద్రబాబు
ప్రభుత్వంలో ప్రజల మధ్య పర్యటించి ఏనాడైనా సమస్యలు తెలుసుకున్నారా..? ఎన్నికల
సమయంలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో చెప్పగలిగారా..? అని ప్రశ్నించారు.
అలాగే గత మూడున్నరేళ్లలో ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు
వివరించారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో నిపుణులైన వైద్యులు అందుబాటులో
ఉంటున్నారని.. వారి సేవలను వినియోగించుకోవలసిందిగా వయోవృద్ధులు, దీర్ఘకాలిక
వ్యాధిగ్రస్తులకు సూచించారు.
ఏమాత్రం వెనకడుగు వేయకుండా ‘వాహనమిత్ర’
పర్యటనలో భాగంగా ఆటో కార్మికులతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు
ముచ్చటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ
డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం
అందిస్తోందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో నాలుగో విడత ద్వారా 1,825
మందికి రూ. 1.82 కోట్ల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. వీరిలో దాదాపు 84 శాతం
మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే
ఉన్నారన్నారు. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం
వెనకడుగు వేయకుండా పథకాన్ని అమలు చేస్తోందని తెలియజేశారు. గత తెలుగుదేశం
ప్రభుత్వం పన్నులు, ఛలానాల రూపంలో ఆటో డ్రైవర్ల నడ్డి విరిచిందని మల్లాది
విష్ణు గుర్తుచేశారు. కానీ వారి కష్టాలు, బాధలను పాదయాత్ర ద్వారా స్వయంగా
గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆటో కార్మికులను ఆదుకునేందుకు వైఎస్సార్
వాహనమిత్ర పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్
ప్రీమియం, ఫిట్ నెస్ ఫీజులను చెల్లించేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతోందని ఆటో
డ్రైవర్లు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డికి రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ చూసి నారా లోకేష్, టీడీపీ నేతలకు
ముచ్చెటమలు పడుతున్నాయని మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే పాదయాత్ర పేరుతో
అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.