గుంటూరు : నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని, మరి అటువంటిది అమరావతి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కోరుకోరని, పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు పేర్ని నాని. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబుకు కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణ అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. ‘సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా?, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?, చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారు. చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యం. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్లో నిజమైన కమ్యూనిజం ఉందా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకెందుకు అంత భయం’ అని పేర్ని నాని నిలదీశారు.