కేసీఆర్ అన్నారు. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకంను
తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లిలో రూ.12
కోట్లతో నిర్మించిన బ్రాహ్మణ సదన్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం
విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ
భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం
గోపన్‌పల్లి గ్రామంలో 6.25 ఎకరాల్లో స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ
సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. దీనికి
2017 జూన్ 5న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ
భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సదనం ఉన్నాయి.
భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా,
రిసోర్స్ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనుంది. ఇందులో భాగంగానే నిర్వహించిన
చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మరోవైపు
రాష్ట్రంలోని బ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధి కోసం 18 మంది సభ్యులతో కూడిన
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి
రిటైర్డ్ ఐఎఎస్ కేవీ రమణాచారి సారథ్యం వహిస్తున్నారు. పరిషత్తు ద్వారా
బ్రాహ్మణుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారు.
పురవాసుల హితం కోరేవారే పురోహితులు
శృంగేరి, కంచి పీఠాధిపతుల చరణ పద్మాలకు వందనాలని కేసీఆర్ ప్రసంగాన్ని
ప్రారంభించారు. సభలో పాల్గొన్న విప్రవరులు, బ్రాహ్మణోత్తములకు నమస్కారములు
తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి వచ్చిన పండితులకు స్వాగతమని
అన్నారు. పురవాసుల హితం కోరేవారే పురోహితులని పేర్కొన్నారు. బ్రాహ్మణుల్లోనూ
చాలామంది పేదలున్నారని వివరించారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100 కోట్లు
కేటాయిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి :
బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్ వివరించారు.
పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు.
బ్రాహ్మణ సదనం భవనాన్ని రూ.12 కోట్లతో నిర్మించామని అన్నారు. వేదశాస్త్ర
విజ్ఞాన భాండాగారంగా ఈ బ్రాహ్మణ సదన్ విలసిల్లాలని ఆకాక్షించారు. ఈ క్రమంలోనే
వేదపండితుల భృతిని రూ.2,500 నుంచి రూ.5 ,000 పెంచామని కేసీఆర్ తెలిపారు.
ధూప, దీప, నైవేద్యాల పథకం కింద ఇచ్చే నిధిని రూ.10,000 పెంచామని కేసీఆర్
తెలిపారు. ఈ క్రమంలోనే బ్రహ్మణుల గౌరవ భృతి అర్హత వయసు 75 నుంచి రూ 65 ఏళ్లకు
తగ్గించామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
సీఎస్ శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి , ఎంపీ రంజిత్ రెడ్డి, కెప్టెన్
లక్ష్మీకాంతరావు , కేవీ రమణాచారి, రాజీవ్‌శర్మ, పీఠాధిపతులు, పండితులు
తదితరులు పాల్గొన్నారు.