అమరావతి : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక
కీలకాంశాలపై తుది నిర్ణయం తీసుకునే సమావేశం జరగబోతోంది. ఈ డ్యాంకు సంబంధించిన
అంశాలు చర్చించి, అధ్యయనం చేసి ఆకృతులకు, ఇతరత్రా సాంకేతికంగా ముందుకు
సాగేందుకు నిర్ణయాలు వెలువరించే డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్పీ)
ఈ నెల 5న ప్రాజెక్టు క్షేత్రం వద్ద సమావేశం కానుంది. ప్రాజెక్టు అథారిటీ
ముఖ్యులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులు, జలవిద్యుత్తు పరిశోధన సంస్థ, మట్టి
పరిశోధనా కేంద్రం, ఎస్ఈఆర్సీ (స్ట్రక్చరల్ ఇంజినీరింగు రీసెర్చి సెంటర్,
చెన్నై), ఐఐటీ దిల్లీ, తిరుపతి నిపుణులు కూడా వస్తున్నారు. ప్రధాన డ్యాం
నిర్మాణానికి ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్ భవితవ్యం తేలే అవకాశం ఉంది. జాతీయ
హైడ్రో పవర్ కార్పొరేషన్ ప్రతినిధులు ఇప్పటికే వీలైనంత మేర డయాఫ్రం వాల్
సామర్థ్యం తేల్చే పరీక్షలు పూర్తి చేశారు. వారు తమ నివేదికను తీసుకొని నేరుగా
సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ప్రజంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.
వారి నివేదిక ఆధారంగా డయాఫ్రం వాల్ ధ్వంసమైనంత మేర నిర్మించడమా? లేక మళ్లీ
కొత్తది పూర్తిగా నిర్మించడమా అన్న అంశాలపై చర్చించనున్నారు. నిపుణులు శనివారం
పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆదివారం సమావేశమై కీలకాంశాలపై చర్చించి
నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. దీని ఆధారంగానే తదుపరి పనులు చేపట్టేందుకు
వీలుంటుంది. అలాగే జాతీయ జల విద్యుత్తు పరిశోధన సంస్థ ప్రతినిధులు ఇచ్చే
నివేదికపై కూడా చర్చించనున్నారు.
ముఖ్యాంశాలు ఇలా : ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో భారీ వరదలతో నదీ
గర్భంలో ఇసుక బాగా కోసుకుపోయింది. అక్కడ సాధారణ భూ భౌతిక పరిస్థితులు
లేకపోవడంతో కోత ప్రాంతంలో తిరిగి అదే గట్టిదనం తీసుకురావడానికి,
పూడ్చివేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అవి ఎంత వరకు ఫలితాన్ని ఇచ్చాయన్న
దానిపై రకరకాల పరీక్షలు చేశారు. కోత పడిన ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపైనా
నిర్ణయాలు ఉంటాయి. నదీ మార్గాన్ని స్పిల్ వే వైపు మళ్లించేందుకు అప్రోచ్
ఛానల్ తవ్వుతున్నారు. 550 మీటర్ల వెడల్పుతో ఈ పనులు కొంత పూర్తయ్యాయి. ఈ
క్రమంలో అధ్యయనాలు, పరిశీలనలో తేలిన సాంకేతిక అంశాలపై చర్చిస్తారు. స్పిల్ వే
నిర్మాణానికి సంబంధించి కొన్ని పియర్లలో లోపాలు, వాటిని సరిదిద్దిన అంశాలకు
సంబంధించి చెన్నైకు చెందిన ఎస్ఈఆర్సీ (స్ట్రక్చరల్ ఇంజినీరింగు రీసెర్చి
సెంటర్) పరిశీలించి సిఫార్సులు చేసింది. వారి నివేదికలపై చర్చ జరిగే అవకాశం
ఉంది.