జెండా ఊపి యాత్రను ప్రారంభించిన కేంద్ర ఆల్ ఇండియా కిసాన్ ప్రధాన కార్యదర్శి
విజు కృష్ణన్
అల్లూరి సీతారామరాజు జిల్లా : అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం
నెల్లిపాక గ్రామంలో మంగళవారం పోలవరం పోరు కేక మహా పాదయాత్రను ఆల్ ఇండియా
కేంద్ర కిసాన్ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ
సందర్భంగా నిర్వాసితులు నాయకులకు పూలమాలను వేసి పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం
పలికారు. ఈ పాదయాత్రలో గిరిజన డోలు, కొమ్ము నత్యాలు ప్రత్యేక ఆకర్షణగా
నిలిచాయి. గిరిజన సంప్రదాయ నృత్యమైన రేలాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు, కిసాన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, తెలంగాణ
సిపిఎం నాయకులు సుదర్శన్, వెంకటేశ్వర్లు, గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.
అనంతరం పోలవరం పోరుకాక మహా పాదయాత్రకు సంబంధించి పుస్తకావిష్కరణ, ప్రత్యేక
పాటల సిడిని ఆవిష్కరించారు. నెల్లిపాక ప్రధాన కూడలి నుండి ప్రారంభమైన ఈ
పాదయాత్రలో భారీ సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు, అభిమానులు, నిర్వాసితులు
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన
సీతారాం, వి.వెంకటేశ్వర్లు, ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, పశ్చిమగోదావరి
జిల్లా నాయకులు బలరాం, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్, మహిళా సంఘం
రాష్ట్ర నాయకురాలు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు,
లోత.రాంబాబు, మోడం నాగయ్య, విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, డివైఎఫ్ఐ ప్రధాన
కార్యదర్శి రామన్న, రాష్ట్ర నాయకులు ప్రసన్న, జిల్లా కమిటీ సభ్యులు
సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, కూనవరం నాయకులు మేకల
నాగేశ్వరరావు, చింతూరు మండల కార్యదర్శి సీసన్ సురేష్. పల్లపు వెంకట్ తదితరులు
పాల్గొన్నారు.
పోలవరం నిర్వాసితులకు పునరావాసం ముందు కల్పించండి…ఆ తరువాతే డ్యాం కట్టండి :
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నెల్లిపాక నుండి ప్రారంభమయ్యే
పాదయాత్ర ముందుగా బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాసరావు మాట్లాడుతూ మండుటెండలైనప్పటికీ పోలవరం పాదయాత్ర ఈరోజు నుండి
జులై 4వ తేదీ వరకు 15 రోజులపాటు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో అనేక
పాదయాత్రలు పదవుల కోసం, అధికారం కోసం జరుగుతున్నాయి. కానీ, ఈ పాదయాత్ర
అలాంటిదికాదు. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం జరుగుతున్న న్యాయమైన పోరాటం
అన్నారు. పాలకులు పోలవరం నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు.
నిర్వాసితులను గోదాట్లో ముంచుతామంటే మాత్రం ప్రభుత్వాన్నే గోదాట్లో
ముంచితీరాల్సి వస్తుందని హెచ్చరించారు. తేల్చుకోవాల్సింది వారేనని స్పష్టం
చేశారు.
10 ఏళ్లుగా ఉన్న సమస్య
రాష్ట్ర విభజన జరిగింది మొదలుకొని దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజల
పరిస్థితి వెలిగి ఆరిపోయే దీపంతా ఉందని వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం
చేశారు. ”ఎప్పుడు వరదలొస్తాయో తెలీదు.. వరదలస్తే ఆదుకునేవారులేరు. పోనీ..
పునరావాసం కల్పిస్తారా అంటే అదీలేదు.. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ
కార్యక్రమాలు జరగవు. చదువు లేదు. వైద్యం లేదు. ఇక్కడ ఏవీ లేవని చెప్పారు.
పునరావాసాలు కల్పించే గ్రామాల పరిస్థితి ఇంతకంటే మరీ అధ్వాన్నంగా ఉందని, ముందు
అవే మునిగిపోయేలా ఉన్నాయని చెప్పారు. ఇళ్లు కట్టామంటూ నిర్వాసితులను బలవంతంగా
వేరే చోట్లకు పంపారనీ, ఆ ఇళ్లు ఎక్కడ కూలిపోతాయోనన్న భయంతో ఆ ఇండ్ల పక్కనే
టెంట్లు వేసుకొని నివాసముంటున్నారని తెలిపారు.
అందుకే
ఈ పోరు యాత్ర
సిఎం జగన్ ఢిల్లీకి వెళ్లి పోలవరం గురించి మాట్లాడి వస్తుంటారు. అధికారులూ
వస్తుంటారు. చర్చించుకుంటారు. ఎన్ని చర్చలు జరిగినా వాటిలో పునరావాసం గురించి
కానీ, నిర్వాసితుల గురించి కానీ మాటమాత్రం రాకపోవడం శోచనీయమని శ్రీనివాసరావు
అన్నారు. ” డ్యాం ఎంత ఎత్తు ఉండాలి. డ్యాంలో స్పిల్ వే ఎక్కడ కట్టాలి.
డయాఫ్రమ్ వాల్ లీకవుతుందా. కారణం ఎవరు ? పోయిన ప్రభుత్వం ఏం తప్పులు చేసిందీ,
ఈ ప్రభుత్వం ఏం తప్పులు చేసిందీ అంటూ ఒకరిపైఒకరు దుమ్మెత్తిపోసుకోవడానికి,
పైచేయి సాధించడానికి ఆతృతపడుతున్నారే తప్ప ఈ ప్రాజెక్టు కింద లక్షలాదిమంది
ప్రజలు మునిగిపోతున్నారు. అందులో అత్యధికంగా ఆదివాసీలున్నారు. వారి బతుకు,
భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి అండగా ఉంటామనే భరోసా ఏ ప్రభుత్వం కానీ, ఏ
నాయకుడు కానీ ఇవ్వడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా విఫలమయ్యాయని, అందుకే ఈ పోరు యాత్ర
చేపట్టామన్నారు.
పునరావాసం కల్పించి ఆ తరువాత డ్యాం కట్టాలి
పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, కేంద్ర ప్రభుత్వం దీని బాధ్యతను తీసుకోవాలని
వి.శ్రీనివాసరావు అన్నారు. దీని నిర్మాణానికి నిధులు కేంద్రమే ఇవ్వాలన్నారు.
మొత్తం రూ.55 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులో రూ.33 వేల కోట్లు
నిర్వాసితులకే ఖర్చు చేయాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఖర్చు చేసిందెంత ? అని
అడిగారు. మొత్తం 9 మండలాల్లో కలిపి రూ.7 వేల కోట్లు మాత్రమే ఖర్చు
చేశారన్నారు. మళ్లీ వరదలొస్తే గ్రామాలు మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు మొదట మొదటి దశలో 20 గ్రామాలే ఉన్నాయని అన్నారనీ, దీనిపై పెద్ద
ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తిన తరువాత మరో సర్వే చేసి కొండను తవ్వి ఎలుకను
పట్టిన చందంగా వాటిలో 36 గ్రామాలు చేర్చారని తెలిపారు. 39 మీటర్లకే 193
గ్రామాలు మొత్తంగా వరదలకు మునిగితే 41 మీటర్లకు ఇంకెన్ని గ్రామాలు
మునిగిపోతాయని ప్రశ్నించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, వారికి
పరిహారం ఇవ్వకుండా, వారికి సరైన సామాజిక భద్రతను కల్పించకుండా ముందుగా డ్యాం
కట్టడం దారుణమన్నారు. పునరావాసం కల్పించి ఆ తరువాత డ్యాం కట్టాలని డిమాండ్
చేశారు.
వరదల్లో కూడా ముంచేశారు
కేంద్రం చుట్టూ తిరిగి డబ్బును తెచ్చి కాంట్రాక్టర్లకు ఇవ్వడమా ప్రాధాన్యత
అవుతుందా ? అని వి.శ్రీనివాసరావు నిలదీశారు. వచ్చిన ప్రతీ పైసాను ముందుగా
పునరావాసానికి ఖర్చు పెట్టాలని, ఆ తరువాతే కాంట్రాక్లర్లకు ఇవ్వాలని
ధ్వజమెత్తారు. నిలువ నీడలేని ఆదివాసీలు, గిరిజన రైతుల గురించి ఆలోచించాలని..
వారికి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్న
నిర్వాసితుల హక్కుల కోసం ఈ పోరాటం సాగిస్తున్నామన్నారు. గతంలో బంద్‌లు,
నిరాహారదీక్షలు, పాదయాత్రలు జరిగాయని తెలిపారు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద
ఇస్తామన్న రూ.10 లక్షలు సిఎం జగన్ ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. వరదల్లో సిఎం
వచ్చి పరిశీలించి ఇండ్లు మునిగినవారికి రూ.10 వేలు ఇస్తామని చెప్పారే తప్ప
ఎవ్వరికీ ఇవ్వలేదని అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పుడు
ముఖ్యమంత్రి జగన్ ఎందుకివ్వలేదని అడిగారు. రూ.2 వేలు ఇచ్చి 10 కెజిల
బియ్యాన్ని ఇస్తే సరిపోతుందా ? అని ప్రశ్నించారు. వరదల్లో కూడా సహాయం చేయకుండా
జనాన్ని ముంచేశారని అన్నారు. మళ్లీ వరదలస్తే మరోసారి పోలవరం మునిగిపోయే
ప్రమాదముందని తెలిపారు.
ఇది ఉమ్మడి సమస్య.. ఉద్యమిద్దాం
వరదలకు ప్రభుత్వం తీసుకునే ముందస్తు చర్యలేంటి అని వి.శ్రీనివాసరావు అడిగారు.
రాజ్యాంగ రీత్యా ఆదివాసీలకున్న హక్కుల ప్రకారం అన్నీ పునరావాసంలో అమలుజరగాలని
డిమాండ్ చేశారు. భూమికి భూమి ఇవ్వాలన్నారు. నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించి
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే కరువు నుండి బయటపడతామని రాష్ట్ర ప్రజలంతా
కోరుకుంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కరువు తీరాలన్నారు. ఇది
ఒక వ్యక్తి సమస్య కాదు.. ఒక తెగ సమస్య కాదు. మొత్తం 5 కోట్లమంది తెలుగు ప్రజల
ఉమ్మడి సమస్య అని చెప్పారు. అందుకే అందరూ ఈ ఉద్యమంలో పాల్గని జయప్రదం చేయాలని
వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్,
పార్టీ అఖిల భారత నాయకులు, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు
కృష్ణన్, తెలంగాణ పార్టీ నేత సుదర్శన్, సీతారాం, వెంకటేశ్వర్లు, అరుణ్, బలరాం,
కనకయ్య, నాగమణి, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రవి, రాష్ట్ర ప్రజా సంఘాల
నాయకులు, గిరిజనులు, ఆదివాసీలు పాల్గొన్నారు.