సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగిపోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి
శ్రీనివాసరావు ఘాటు విమర్శలు చేశారు. గురువారం పోలవరం నిర్వాసితుల పోరుకేక
సిపిఎం మహా పాదయాత్ర 10వ రోజు రెండు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకుని
బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం చేరుకుంది. ఈ సందర్భంగా రెడ్డి గణపవరంలో
ఏర్పాటు చేసిన సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్వాసితులను బలవంతంగా
తరలించడం దుర్మార్గమన్నారు. వసతులు లేని పునరావాస కాలనీలలో నిర్వాసితులు
అమానుష జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, విద్యుత్,
రోడ్డు, డ్రైనేజీ, కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న నిర్వాసితులకు కనీస
చిరునామా కూడా కరువైందని తెలిపారు. కొందరి నిర్వాసితులు పునరావాస కాలనీలకు
వచ్చినప్పటికీ వారి చిరునామా గతంలో నివాసం ఉన్న గ్రామ చిరునామా ఉందని
తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన ప్రతి పైసా ముందుగా నిర్వాసితులకే
కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత సమస్యలను వెల్లడి చేస్తే ప్రభుత్వ
సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు రద్దు చేస్తామని నీచమైన బెదిరింపులు చేయడం
తగదన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు.
పోలవరం ప్రాజెక్టు నిధులతో నిర్వాసిత సమస్యలను పరిష్కారం చేయకుండా ఎవరికి
చెల్లిస్తున్నారో ప్రభుత్వాలు బహిర్గతం చేయాలని అన్నారు. నిర్వాసితులకు న్యాయం
జరిగే వరకూ అవసరమైతే ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు
నిర్మాణ డిజైన్లను మారుస్తూ వేల కోట్లు ఖర్చు చూపుతున్న ప్రభుత్వాలకు
సిగ్గులేదని అన్నారు. ముంపుకు గురైన నిర్వాసితులకు 10,000 పరిహారం
చెల్లిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని ఎద్దేవా చేశారు.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం చేస్తున్న కుట్రను తిప్పి
కొట్టాలని నిర్వాసితులకు పిలునిచ్చారు. నిర్వాసిత కాలనీలో ఉపాధి లేక
దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా
నిర్వాసిత సమస్యలు పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పోరుకేక మహాపాదయాత్రకు
అన్ని రాజకీయ పార్టీలు సంఫీుభావం తెలుపుతున్నాయని అన్నారు. అధికారం కోసమో,
రాజకీయ లబ్ధి కోసమో కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్న సిపిఎం
పాదయాత్రను జయప్రదం చేయాలని అన్నారు.
పాదయాత్రకు సిపిఐ(యం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, బి.బలరాం,
విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యులు, ఆశా వర్కర్ యూనియన్,
పశ్చిమగోదావరి జిల్లా ఐద్వా కార్యదర్శి పొగాకు పూర్ణ, కోశాధికారి ఎస్.జయప్రభ,
ఐద్వా కాకినాడ జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి, కోశాధికారి టి.నాగమణి, జనసేన
బుట్టాయిగూడెం మండల కమిటీ అధ్యక్షులు తెల్లం రవిప్రసాద్ తదితరులు సంఫీుభావం
తెలిపారు.
నిద్రపోతున్న ప్రభుత్వాల మెడలు వంచాలి : బోరగం శ్రీనివాస్ టీడిపి పోలవరం
నియోజకర్గం కన్వీనర్
పోలవరం నిర్వాసితుల సమస్యలపై మొద్దు నిద్దురలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ
మెడలు పంచడానికి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం నిర్వాసితుల పోరుకేక
పాదయాత్ర హర్షనీయమని పోలవరం నియోజకవర్గ టిడిపి కన్వీనర్ బోరగం శ్రీనివాస్
అన్నారు. గురువారం పోలవరం నిర్వాసితుల పోరు కేక మహా పాదయాత్రకు ములగలంపల్లి
వద్ద బోరగం శ్రీనివాస్ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభ లో
ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు
పరిహారం పూర్తిస్థాయిలో అందించాలన్నారు. ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా సిపిఎం
చేస్తున్న పోరుకేక పాదయాత్రకు పూర్తి సంఫీుభావం తెలుపుతున్నామని అన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కారంలో టిడిపి తరఫున ఏ సహకారానికైనా ముందుంటామని
బోరగం శ్రీనివాస్ తెలిపారు.