నేడు రాజమహేంద్రవరంలో ఆకృతులపై సమీక్ష
పోలవరం : పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) 21వ సమావేశం
పురస్కరించుకుని ప్యానల్ ఛైర్మన్ ఏబీ పాండ్యతో పాటు 38 మంది సభ్యులతో కూడిన
బృందం ప్రాజెక్టులో పలు పనులను పరిశీలించింది. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో
రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ వారితో కొంతసేపు
మాట్లాడారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారటీ (పీపీఏ) ముఖ్య
కార్యనిర్వహణాధికారి శివనందన్‌కుమార్, ఎన్‌హెచ్‌పీసీ మాజీ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ ఎస్.ఎల్.కపిల్, మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ్, ఈఎన్సీ
సి.నారాయణరెడ్డి, అనిల్ జైన్ ఇతర సభ్యులతో కలిసి గ్యాప్-2లోని
డయాఫ్రంవాల్, అక్కడ పరిశోధనలు నిర్వహిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు.
అనంతరం ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, దిగువకాఫర్ డ్యామ్, పైడిపాక వద్ద
డంపింగ్‌యార్డు కొండను, గైడ్‌బండ్, అప్రోచ్ ఛానల్లను సందర్శించారు.
సాయంత్రం స్పిల్‌వేలోని వాక్‌వే బ్రిడ్జిపై నుంచి గేట్లను, గ్యాలరీని
పరిశీలించారు. వారి వెంట ప్రాజెక్టు సీఈ బి.సుధాకరబాబు, ఏపీజెన్కో అధికారులు,
మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. ఆరుగంటల సమయంలో ప్రాజెక్టుకు
చేరుకున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ
పాండ్య మరికొంత మంది సభ్యులతో సమావేశమయ్యారు. కీలకమైన డయాఫ్రం వాల్
పరిస్థితిపైనే చర్చించినట్లు తెలిసింది. ఆదివారం రాజమహేంద్రవరంలో సమావేశమై
ఆకృతులపై సమీక్షిస్తారని జలవనరుల శాఖాధికారులు పేర్కొన్నారు.