సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం
పోలవరానికి నిధుల విడుదలకు మార్గం సుగమం
అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా ముందస్తు
(అడ్‌హక్) నిధులివ్వాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర
ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలి, రెండో దశ పనులను పూర్తి చేయడానికి ఏ
మేరకు నిధులు అవసరమో గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర జలసంఘం
(సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లను ఉన్నతస్థాయి కమిటీ
సోమవారం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి
మండలికి కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. దానిపై
కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే అడ్‌హక్‌గా పోలవరానికి నిధుల విడుదలకు
మార్గం సుగమం అవుతుంది. రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా విడుదల చేసి, నిధుల కొరత
లేకుండా చేయాలని, డిజైన్లను త్వరితగతిన ఆమోదిస్తే పోలవరాన్ని సత్వరమే పూర్తి
చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
అడ్‌హక్ నిధుల విడుదలతోపాటు సీఎం జగన్ లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో
రెండుసార్లు రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశాలలో అడ్‌హక్‌గా పోలవరానికి
నిధులిచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకు సంబంధించిన
ప్రతిపాదనలు పంపాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కేంద్ర కమిటీ ఆదేశించింది.
మార్చి వరకూ రూ.7,300 కోట్లు : ఇప్పటివరకూ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను
రీయింబర్స్మెంట్ చేయడం, మార్చి వరకూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పనులు
చేయడానికి రూ.7,300 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ కేంద్రానికి
ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్
అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఢిల్లీలో సమావేశమై చర్చించింది.
పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, తక్షణం ప్రభుత్వానికి
నిధులు విడుదల చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పంపిన
ప్రతిపాదనలను పరిశీలించి తొలి దశ, రెండో దశ పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమో
నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీ, పీపీఏలను ఆదేశించింది.