నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక సమావేశం
పోలవరం నిర్వాసితుల సమస్యలపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో సిపిఎం
బృందం భేటీ
విజయవాడ : పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి
సంబంధించిన సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ
మేరకు వచ్చే వారం రాజమండ్రిలో నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో
చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర జలవనరులశాఖ
మంత్రి అంబటి రాంబాబు హామీ ఇచ్చారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి
క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని పోలవరం
నుండి విజయవాడ వరకు ‘పోలవరం పోలికేక’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టిన సిపిఎం
ప్రతినిధి బృందంతో మంత్రి అంబటి రాంబాబు, అధికారులు ప్రత్యేకంగా
సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ఆండ్ఆర్ కమిషనర్ డాక్టర్ చెరుకూరి
శ్రీధర్, పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళావందనంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్‌రావు, సిపిఎం రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారాం, రంపచోడవరం, ఏలూరు
జిల్లాలకు చెందిన సిపిఎం నాయకులు బి.కిరణ్, ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాదయాత్రలో గుర్తించిన సమస్యలను మంత్రి అంబటి రాంబాబుకు
వి.శ్రీనివాసరావు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పునరావాస సమస్యలు
2007 నుండి అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న
కాంటూరు లెవల్స్ 41.15 మీటర్లు, 45.72 మీటర్లకు మించి 2022 వరదల్లో ముంపుకు
గురైందని తెలిపారు. చాలా గ్రామాలతో పాటు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస
కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయంటే అధికారులు చెబుతున్న కాంటూరు లెవల్స్
లెక్కలపై అనుమానాలు కలుగుతున్నాయని వివరించారు. వరద ముంపు గ్రామాలన్నింటికీ
ఖచ్చితంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లైడార్
సర్వే చేపట్టాక కూడా ముంపుపై ఖచ్చితత్వం రావడం లేదని అధికారులు క్షేత్ర
స్థాయిలో మరోసారి సమగ్రంగా ముంపుపై సర్వే చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
అసైన్డ్ భూములు, అటవీ భూములు, పోడు భూములకు సంబంధించిన సమస్యలను సానుకూలంగా
పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని వి.శ్రీనివాసరావు కోరారు.
ఇందుకు రీహ్యాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) కమిషనర్
చెరుకూరి శ్రీధర్ జోక్యం చేసుకుంటూ వరదలతో మునిగిన ప్రాంతాలన్నింటికి
ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు
అంగీకరించడం లేదన్నారు. వి.వెంకటేశ్వర్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
చేపట్టాకే కొత్తగా ముంపు ఏర్పడినందున అక్కడ ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఇవ్వాలని
కోరుతున్నామన్నారు. అలాగే 1986లో వచ్చిన వరదలు 2022 కంటే పెద్ద వరదలు అని,
అయినా అప్పుడు ఇంతటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. వరద సమస్య, ప్రాజెక్టు
ముంపు సమస్య వేర్వేరు కాదని ఒకటేనని శ్రీనివాసరావు అధికారులకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.10లక్షల నష్టపరిహారాన్ని చాలా కొంతమందికే అమలు
చేశారని అందరికీ వర్తింపజేయాలని కోరారు. ముంపు ప్రాంతంలోని భూములకు వ్యవసాయ
ఉత్పత్తి, మైదాన ప్రాంతంలోని భూములకు ఇచ్చిన రేటు ఇవ్వాలని మంతెన సీతారాం
కోరారు. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని, వాటిని శాస్త్రీయ పద్ధతిలో
సరిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. పునరావాస కాలనీల్లో మౌలిక
సదుపాయాలు లేవని, త్రాగునీరు లేదని, శ్మశానాలకు స్థలాలను కేటాయించకపోవడంతో
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రెండు జిల్లాలకు చెందిన నాయకులు తెలిపారు.
చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారందరికీ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని
కోరారు. కాలనీల సమస్యలపై నిర్దిష్ట అధ్యయనం చేసి 15 రోజుల్లో గుర్తిస్తామని
అధికారులు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పునరావాసం అందించే అంశంలో
ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. ముంపుపై శాస్త్రీయ పద్ధతిలేకుండా
కేంద్రం నిధులను ఇవ్వదని అన్నారు. ఇప్పటికే పునరావాసం కోసం కేంద్రం
ప్రత్యేకంగా రూ.5వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. నిర్వాసితుల సమస్యలను
పరిష్కరించేందుకు వారం రోజుల్లో రాజమండ్రిలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు
చేస్తామని తెలిపారు. సామూహిక సమస్యలతో పాటు నిర్దిష్ట సమస్యలు ఆ సమావేశం
దృష్టికి తీసుకురావాలని కోరారు. చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు అనేక సమస్యలను
నిర్దిష్టంగా మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని అధ్యయనం చేసి తెలియజేస్తామని
చెప్పారు. వరదలు రానున్న ఈ సమయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు
కోరగా వాటిని రెవెన్యూ శాఖతో విడిగా చర్చించాలని మంత్రి కోరారు.
ఆర్ అండ్ ఆర్ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ పునరావాసానికి
సంబంధించిన పనులన్నీ పురోగతిలో వున్నాయని తెలిపారు. ప్రతి అంశాన్ని
ఆన్లైన్లో పెడుతున్నామని ఎవరూ బ్రోకర్ల చేతుల్లో మోసపోవద్దని కోరారు.
ప్రజల్లో పునరావాస ప్యాకేజీ పనులపై అవగాహన కల్పించేందుకు సిపిఎం సహకరించాలని
కోరారు. డ్యాం నిర్మాణం కన్నా ముందు ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలని
శ్రీనివాసరావు అధికారులను కోరారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ముంపు
మండలాల నుండి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శులతోపాటు నాగమణి, సీతారామయ్య,
సంతోష్, రామకృష్ణ, నాగేంద్ర, వెంకట్రావు, నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వర్లు,
రాధ, వెంకట్ తదితరులు మాట్లాడారు.