ధ్వంసమైన గైడ్‌బండ్, ఎగువ కాఫర్ డ్యాం లీకేజీల పరిశీలన
అమరావతి : పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ
గురువారం సందర్శించనుంది. స్పిల్ వే ఎగువన ఎడమ వైపున నిర్మించిన గైడ్‌బండ్,
రిటైనింగ్ వాల్ కొంత మేర ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో పాటు ఇప్పటికే
నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాంలో లీకేజీల సమస్య ఇబ్బంది పెడుతోంది. క్రమేణా
లీకేజీ నీరు పెరుగుతోంది. ప్రస్తుతం వస్తున్న నిపుణుల బృందం ఈ రెండు అంశాలను
పరిశీలిస్తుంది. శుక్రవారం ఉదయం స్థానిక అధికారులు, ఇంజినీర్లతో సమావేశమై ఈ
రెండు అంశాలపై లోతుగా చర్చిస్తారు. అనంతరం కేంద్ర జలసంఘానికి నివేదిక
సమర్పిస్తారు. ఈ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు సూచించనున్నారు. ఈ రెండు
అంశాలపై డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలోను రాబోయే రోజుల్లో చర్చించే
అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో గైడ్‌బండ్ ధ్వంసమైన అంశానికి సంబంధించి
కేంద్ర జల్‌శక్తి శాఖ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం మాజీ
ఛైర్మన్ ఏబీ పాండ్యా ఛైర్మన్‌గా, కేంద్ర జలసంఘం సభ్యుడు ఎస్.కె.సైబల్,
సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చి స్టేషన్ డైరెక్టర్ ఆర్.చిత్ర,
చీఫ్ ఇంజినీరు వివేక్ త్రిపాఠి, కేంద్ర జల సంఘం డైరెక్టర్ ఖయూం మహమ్మద్,
సీఎస్ఎంఆర్ఎస్ శాస్త్రవేత్త మనీష్ గుప్తాలను ఈ కమిటీలో నియమించారు. వీరు
గురువారం పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. అక్కడ ధ్వంసమైన గైడ్‌బండ్‌ను
పరిశీలిస్తారు. ఎగువ కాఫర్ డ్యాం నుంచి లీకేజీలు ఉన్న ప్రాంతాన్ని
సందర్శిస్తారు.
ముంపుపై నివేదిక కోరిన ఎస్టీ కమిషన్ : పోలవరం ముంపు వల్ల ఒడిశాలోని
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, సహాయ,
పునరావాస కార్యక్రమాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, ఒడిశా ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శుల నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ పూర్తిస్థాయి నివేదిక కోరింది.
ఈ మేరకు ఒడిశా సీఎస్ ప్రదీప్‌కుమార్ జెనా, జల్‌శక్తి శాఖ కార్యదర్శి
పంకజ్కుమార్లకు లేఖలు రాసింది. 15 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని
ఆదేశించింది. పోలవరం ముంపు కారణంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత
పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒడిశాకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది
రాధాకాంత త్రిపాఠి ఎస్టీ కమిషన్ వద్ద పిటిషన్ దాఖలు చేయగా జాతీయ ఎస్టీ
కమిషన్ స్పందించింది. గడువులోగా సమాధానం రాకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాలని
సమన్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.