గుంటూరు : విశాఖలో కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ
ఇచ్చారు. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో
శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ
ప్రశాంతంగా ఉంది. ఏపీ క్రైమ్‌రేట్ తగ్గిందని స్పష్టం చేశారు. డీజీపీ
రాజేంద్రనాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్ విషయం విశాఖ ఎంపీ ఫోన్
చేసి అక్కడి సీపీకి సమాచారం ఇచ్చారు. ఆడిటర్, ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్
చేసినట్టు సమాచారం వచ్చింది. రిషికొండలో బాధితులు ఉన్నట్టు ట్రేస్ చేశాం.
పోలీసులకు సమాచారం వచ్చినట్టు నిందితులకు తెలిసింది. ఎంపీ కొడుకు, భార్య, మరో
వ్యక్తిని తీసుకుని మళ్లీ పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. పద్మనాభపురం
వరకూ వెళ్లి అక్కడ బాధితులను వదిలి పారిపోయారు. డబ్బు కోసమే ముందుగా ఎంపీ
కుమారుడిని కిడ్నాప్ చేశారు. కుమారుడితో ఫోన్ చేయించి తల్లిని రప్పించారు.
గంటల వ్యవధితోనే కిడ్నాపర్లను పట్టుకున్నాం. కిడ్నాపర్లు రూ.కోటి 75లక్షలు
తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.85లక్షలు రికవరీ చేశాం. కత్తితో చంపేస్తామని
కిడ్నాపర్లు బెదిరించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. ఇవాళ
నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందనడం
సరికాదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగానే ఉన్నాయి. రౌడీషీటర్లు లేకుండా
విశాఖ ప్రశాంతంగా ఉంది. పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలోనే
కిడ్నాపర్లను పట్టుకోగలిగాం. భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయి. గంజాయి
పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ
యాక్ట్‌లు పెడుతున్నాం. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి
సాగు లేదు. నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయని వెల్లడించారు.