తొలిసారిగా హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్
వెలగపూడి : రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు తీపి కబురు చెప్పింది.
6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు,
6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్
బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్
(పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100
కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి.
ఎస్ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక
దరఖాస్తు సరిపోతుంది. కానిస్టేబుల్ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్,
ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్
పోస్టులకు వేర్వేరుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శరీరదారుఢ్య పరీక్షలు, ఫైనల్
రాతపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీలో
రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తారు. హోంగార్డులకు తొలిసారిగా కానిస్టేబుల్
పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం విశేషం. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 8
శాతం నుంచి 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల్లో 10 శాతం నుంచి 25 శాతం
హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు.
అభ్యర్థుల అర్హతలు, వయో పరిమితి మినహాయింపులు, దరఖాస్తు ఫీజు, రాతపరీక్షల
విధానం, శరీరదారుఢ్య పరీక్షల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఏపీ పోలీస్
రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https:// slprb.ap.gov.in చూడాలని బోర్డు
సూచించింది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్
బోర్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని
తెలిపింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9441450639
పూర్తి పారదర్శకంగా పోలీసు నియామక ప్రక్రియ నిర్వహిస్తాం :డీజీపీ
కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి
పోలీసు ఉద్యోగాల భర్తీప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా
నిర్వహిస్తాం. 2023 జూన్ చివరినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి అభ్యర్థులకు
శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో 2024 ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో
పోస్టింగులు ఇవ్వొచ్చు. ఏటా ఇదేరీతిలో పోలీసు ఉద్యోగాలు భర్తీచేయాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది.