విజయకుమార్ సూచన
గుంటూరు : వాతావరణంలో శరవేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రకృతి
వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని రైతు సాధికార సంస్థ
ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయకుమార్ సూచించారు. రైతుల సంక్షేమం, పర్యావరణ
పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని సుస్థిర ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని,
దీనిని ఓ సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం
గుంటూరు గోరంట్లలోని రైతు సాధికార సంస్థ కార్యాలయంలో 2022 వ బ్యాచ్ కి
చెందిన డిప్యూటీ కలెక్టర్లకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ప్రకృతి
వ్యవసాయం పై రెండు గంటల పాటు అవగాహన కల్పించారు. ఏడాదిగా శిక్షణలో ఉన్న
డిప్యూటీ కలెక్టర్ల శిక్షణ ఈనాటితో పూర్తి అయింది. శిక్షణ లో భాగంగా డిప్యూటీ
కలెక్టర్లకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ప్రజలతో పని చేసే అవకాశం కలగడం చాలా
గొప్పదని, ప్రజలతో మమేకమై పని చేయాలని డిప్యూటీ కలెక్టర్ లకు సూచించారు.
ముఖ్యంగా పేదవారి సమస్యలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాతావరణ సమస్య అతి పెద్దదని,
అందుకే వ్యవసాయ పర్యావరణంలో మార్పులకు దోహదం చేసే ప్రకృతి వ్యవసాయం ప్రపంచ
దృష్టిని ఆకర్షించిందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి అనుకూల
వ్యవసాయం కేవలం 1 శాతం మాత్రమే చేస్తున్నారని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో
అత్యధికంగా 14 శాతం చేస్తూ ఎంతో వేగంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మనం
తీసుకునే ఆహార ఉత్పత్తులను పండించడం కోసం మితిమీరిన రసాయనాలు వాడుతున్నారని,
వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులే ఎన్నో రకాలుగా మేలు
చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అధిక ఖర్చులు, పంట చేతికి వస్తుందనే నమ్మకం
లేకపోవడం, గిట్టుబాటు ధరల్లో సందేహాలు కలగలసి యువత వ్యవసాయంలో అడుగిడాలంటే
వెనుకంజ వేస్తున్నారని చెప్పారు.
మానవాళి ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యాన్ని, వాతావరణ పరిరక్షణను దృష్టిలో
ఉంచుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్
సంస్థల సహకారం కూడా బాగా అందుతోందని చెప్పారు. 1970 వ సంవత్సరం నుంచి 2016
వరకు ఎరువుల వినియోగాన్ని పరిశీలించి చూస్తే 10 రెట్ల వినియోగం పెరిగిందని,
అందువల్ల ఆహారంలో పోషక విలువలు నశించిపోతున్నాయని అన్నారు. ఈ పద్ధతి ఇలాగే
కొనసాగితే భవిష్యత్తులో ఆహారం కోసం ఆదాయంలో సగం వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని
నివేదికలు హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఎడారి ప్రాంతంగా పేరుగాంచిన అనంత పురం
జిల్లాలో అనేక నమూనాలు రూపొందించామని, నేలను ఏడాది పొడవునా కప్పి ఉంచితే భూమి
చల్లబడుతుందన్నారు. మీరు మీ అధికారిక నివాసాలలో కనీస విస్తీర్ణంలో ప్రకృతి
వ్యవసాయాన్ని ప్రారంభించమని డిప్యూటీ కలెక్టర్ లకు సూచించారు. మీ పరిధిలో
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలని కోరారు.
రైతు సాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి . రామారావు మాట్లాడుతూ
ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు సాధికార సంస్థ ద్వారా లక్షలాది మంది రైతులు
ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నందున ఇతర రాష్ట్రాలు, దేశాలు
కూడా ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తున్నాయని, దేశవ్యాప్త అమలు కోసం నేషనల్ రిసోర్స్
ఆర్గనైజేషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆదాయం పెంచేదుకు
ఏటీఎం అని, ఏ గ్రేడ్ మాడెల్ అని రకరకాల నమూనాలను రూపొందిస్తున్నట్టు
చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, జర్మన్ ప్రభుత్వ సహకారంతో 174 కోట్ల
రూపాయలతో పులివెందులలో అకాడమీ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రపంచంలో
మరెక్కడా లేని విధంగా రైతు శాస్త్రవేత్త కోర్సు ను రూపొందించి
ప్రారంభించినట్లు చెప్పారు. విదేశాలకు కూడా ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని
తీసుకు వెళ్లేందుకు కమ్యూనిటి రిసోర్స్ పర్సన్ల వ్యవస్థను తయారు చేస్తున్నామని
చెప్పారు. ఈ అవగాహనా కార్యక్రమంలో 24 మంది డిప్యూటీ క్లలెక్టర్లు పాల్గొన్నారు.