గుంటూరు : వ్యవసాయ రంగ అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేక
కథనాలతో రైతులకు సేవలందిస్తున్న రైతునేస్తం వ్యవసాయ పత్రికా సంపాదకులు
పద్మశ్రీ యండ్లమూరి వెంకటేశ్వరరావు సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్
ప్రెస్ అకాడమి జ్ఞాపికను అందించింది. ఇటీవల వ్యవసాయ రంగాన్ని
పరిశీలించినట్లయితే యువత సాప్ట్వేర్ రంగంలో ఉన్నవారు తమ ఆలోచనలను పంటల
సాగువైపు మళ్ళిస్తున్నారు. ఉద్యోగ వ్యాపారాల్లో విసికెత్తిన వారు వ్యవసాయ
రంగంపై శ్రద్థ ఉన్నవారు వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి సేంద్రియ పద్థతులతో పంటలు
పండించడానికి మక్కువ చూపిస్తున్నారు అని ఈ రోజు గుంటూరు జిల్లా, కొర్నెపాడులో
రైతునేస్తం ఫౌండేషన్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్
అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్, రైతునేస్తం ఫౌండేషన్
చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో అనేక
ఇబ్బందులు ఎదురవుతున్నారు. దానికి పరిష్కారంగా రైతులు సేంద్రియ వ్యవసాయ బాట
పడుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి రైతులలో అవగాహన కల్పించడానికి
రైతునేస్తం చేస్తున్న కృషి ఎనలేనిది. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన మన దేశీయ
గోజాతులు అరుదైన ఒంగోలు, గిర్, పుంగనూరు, కాంగ్రెజ్ మొదలగు ఆవు జాతులు
రైతునేస్తం ఫౌండేషన్ గోశాలలో చూడడం చాలా ఆనందకరం. వీటి యొక్క వ్యర్థాలతో
తయారు చేసిన వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు ఉపయోగించి పంటలు పండించడం
ప్రత్యక్షంగా చూడడానికి ఈ సందర్భంగా అవకాశం కుదిరింది. వీటికి తోడు ఎలాంటి
రసాయనాలు లేకుండా పండించిన ఉత్పత్తులను రైతుల దగ్గర నుండి కొనుగోలు చేయడంతో
పాటు వినియోగదారులకు అందించడం మంచి పరిణామం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
అందించే పుట్టగొడుగుల పెంపకం, వానపాముల ఎరువు తయారీ లాంటి వాటిని ఏర్పాటు
చేయడంతో పాటు చిరుధాన్యాల ప్రొసెసింగ్, కట్టె గానుగలతో నూనె తీయడానికి వీలుగా
కట్టె గానుగలను రైతునేస్తం వారు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం అంటూ ఈ
సేవలు అందిస్తున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి
వెంకటేశ్వరరావుని కొమ్మినేని అభినందించారు.