వ్యవసాయానికి సాంకేతిక దన్ను
చిరుధాన్యాలతో రైతులకు మేలు
జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ
హైదరాబాద్ : వ్యవసాయరంగంలో సవాళ్లను అధిగమించి ప్రపంచంలో ఆహార భద్రత
లక్ష్యాన్ని సాధించడానికి అన్ని దేశాలు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని ప్రధాని
నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సమ్మిళిత, సంతులిత ఆహారవ్యవస్థల వృద్ధితోపాటు
సన్నకారు రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని, భూసారం పెంపుదల, అధిక దిగుబడుల
సాధనపై దృష్టి సారించాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతికతల
ద్వారా రైతులు సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో
జరుగుతున్న జీ-20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఆయన దృశ్యమాధ్యమంలో
ప్రసంగించారు. ‘‘ప్రపంచంలోని 250 కోట్ల మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్న
వ్యవసాయం… ఆయా దేశాల జీడీపీలో 30% భాగస్వామ్యం కలిగి ఉంది. 60 శాతానికి
పైచిలుకు ఉద్యోగాలనూ కల్పిస్తోంది. వాతావరణంలో మార్పు కారణంగా
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భౌగోళిక రాజకీయ
ఉద్రిక్తతల ప్రభావం, కరోనా మహమ్మారి కారణంగా సరఫరా గొలుసు అంతరాయం మరింత
పెరిగింది. ఈ నేపథ్యంలోనే ‘మూలాల్లోకి వెళదాం… భవిష్యత్తులోకి అడుగేద్దాం’
అనే నినాదంతో భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అన్నదాతలకు
సాంకేతికతను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఫలితంగా దేశంలో కృత్రిమ
ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గుతోంది. రైతులు భూసారాన్ని
పరిరక్షిస్తున్నారు. నీటి వనరుల సద్వినియోగంతోపాటు సస్యరక్షణ చర్యలను
అవలంబిస్తున్నారు.
ఫలసాయాన్ని పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా
ఉపయోగిస్తున్నారు. పొలాల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. పంటల
ఎంపికకు, సాగులో గరిష్ఠ ప్రయోజనాలను అందుకోవడానికి భూసార ఆరోగ్యకార్డులను
వాడుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. మనం 2023
సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్నాం. చిరుధాన్యాలు
పౌష్టికాహారంగానే కాకుండా తక్కువ నీరు, ఎరువులతో చీడపీడలను తట్టుకుంటూ రైతుల
ఆదాయాలను పెంచుతాయి. అయితే సరైన విక్రయ విధానాలు లేక దిగుబడులకు సరైన ధరలు
లభించడం లేదు. చిరుధాన్యాల సాగులో అత్యుత్తమ అభ్యాసాలను, పరిశోధనలను,
సాంకేతికతలను పరస్పరం పంచుకోవాలి. దీనికోసం హైదరాబాద్లోని చిరుధాన్యాల
పరిశోధన సంస్థను అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. మనం చిరుధాన్యాలతో
చేస్తున్న ‘శ్రీఅన్న’ను ఇష్టమైన ఆహారంగా స్వీకరిద్దాం. చిరుధాన్యాలతోపాటు ఇతర
ఆహార ధాన్యాలను ప్రోత్సహించడానికి జీ-20 సదస్సులో వ్యవసాయ మంత్రులు దక్కన్
హైలెవల్ ప్రిన్సిపల్స్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్, మహారుషి
అనే రెండు కార్యక్రమాలతో అండగా నిలవాలని నిర్ణయించడం సంతోషంగా ఉంది. పునఃపోషణ
ప్రధానమైన వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోని
వివిధ ప్రాంతాల సంప్రదాయ విధానాలను ప్రేరణగా తీసుకుందాం’’ అని మోడీ
పిలుపునిచ్చారు.