విజయవాడ : ప్రచార ఆర్బాటాల కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలు బలి పెడుతున్నాడని,
డ్రోన్ కెమేరా షాట్ల కోసం జనాన్ని ఇరుకైన సందుల్లో నింపి ప్రమాదాలు పాలు
చేస్తున్నాడని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి
రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం చంద్రబాబు రోడ్ షో లో జరిగిన తొక్కిసలాటలో
8 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లాలో జరిగిన
చంద్రబాబు రోడ్ షోలో మరో ముగ్గురు మృతి చెందిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి
గురిచేసిందని అన్నారు. చంద్రబాబు రోడ్ షోలో నాలుగు రోజుల వ్యవధిలో రెండు
ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, 11 మంది మృతి చెందారని తెలిపారు. ప్రజల ప్రాణాలు
బలిగొంటున్న తెలుగుదేశం పార్టీ పచ్చరంగు వీడి ఎరుపు రంగుగా
మార్చుకున్నట్లుందని అన్నారు.
అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు : రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం
చుట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనకాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు
ఏర్పాటు చేస్తోందని అన్నారు. తొలిదశలో 59 ఎకరాల్లో పార్కు అభివృద్ధి చేసి, రూ
12.69 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనుందని అన్నారు. ఎఐసిసి ఇప్పటికే
టెండర్లు ఆహ్వానించిందని అన్నారు. గడిచిన మూడున్నరేళ్ల లో ఎంఎస్ఎంఈలు
రెట్టింపు అయ్యాయని అన్నారు.
64.06 లక్షల మందికి లబ్ది : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య
పింఛన్లు జనవరి 1 నుంచి రూ.2750 కి పెంచి 64.06 లక్షల మంది లబ్ధిదారుల
ముఖాల్లో వెలుగులు నింపిందని విజయసాయి రెడ్డి తెలిపారు. మొదటి రోజే 1257.25
కోట్ల అందజేసిందని, లబ్దిదారులకు నూతన సంవత్సర కానుక ఇచ్చిందని అన్నారు. గతంలో
తెదేపా ప్రభుత్వం పింఛన్ల కోసం చేసిన ఖర్చు 400 కోట్లు కాగా అంతకు నాలుగింతలు
అధికంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ 1765 కోట్ల ఖర్చు చేస్తోందని అన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పెన్షన్ రూ 3000 చేస్తారని అన్నారు.
అది 2019 నాటికి ఇస్తున్న పెన్షన్ తో పోల్చుకుంటే మూడింతలు అధికమని అన్నారు.