నల్లజర్ల : ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అధికారులను ఆదేశించారు. శనివారం నల్లజర్ల మండలం నల్లజర్ల ప్రియా ప్రియాంక గార్డెన్స్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని 24 గ్రామాల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామాల్లోని సమస్య లను హోంమంత్రి దృష్టి కి తీసుకురాగా వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాలన్నారు. సంక్షేమంతో పాటు పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులతో మండల్లాలోని గ్రామాల వారీగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి ప్రతి పేదవాడికి అభివృద్ధి పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించాలన్నారు. త్వరలో గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని.. హోం మంత్రి వారి గ్రామాల పర్యటన నాటికి ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాల్లో పెండింగ్ సమస్యలు పూర్తి అయ్యేలా చూడాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఆదేశించారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, సర్వ శిక్ష అభియాన్, విద్యుత్ శాఖ, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్., అర్ అండ్ బీ అధికారుల పనితీరు పై మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు.