విజయవాడ : స్మార్ట్, ప్రీపెయిడ్, ట్రూఅప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై
వేలకోట్ల భారాలు మోపుతున్నారని, వాటిని ఆపకపోతే రాష్ట్రంలో మరో విద్యుత్
ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,
కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు హెచ్చరించారు. గురువారం విజయవాడలో
వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారాలపై వినియోగదారులు ప్రశ్నించాలని,
ట్రేడ్యూనియన్లు, ప్రజా సంఘాలు ముందుకొచ్చి పోరాడాలని కోరారు. వ్యవసాయ మీటర్ల
వినియోగదారులపై ఆరువేల కోట్ల భారం పడుతుందని వివరించారు. రెగ్యులేటరీ కమిషన్
అనుమతి లేకుండా మీటర్ల కొనుగోలు చేయరాదని, అయినా ఏకపక్షంగా కొనుగోలు చేశారని
తెలిపారు. దీన్ని కమిషన్ ముందుకు వచ్చి విచారించాలని తెలిపారు. శ్రీకాకుళం
జిల్లాలో పెట్టిన మీటర్లపై ప్రయాస్ ఎనర్జీగ్రూప్ విచారణ చేసిందని, ఈ
నివేదికను బయటపెట్టాలని అన్నారు. అలాగే హరిత ఎనర్జీ పేరుతో 75 వేల ఎకరాలను
అదానీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని వివరించారు. మోడీ ఆదేశాల
మేరకే రాష్ట్రం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మన్యం, అల్లూరి జిల్లాల్లో
గిరిజనులను రోడ్డున పడేసేందుకు రాష్ట్రం సిద్ధమైందని తెలిపారు. దీనిపై
ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అదానీకి భూములు ఇవ్వొద్దని వారు డిమాండు
చేశారు. ఎవరైనా పరిశ్రమలు పెడతామంటే ఇప్పటికే సేకరించిన భూములున్నాయని వాటిని
ఇవ్వొచ్చని అన్నారు.
చాలా జిల్లాల్లో పంపుసెట్లకు పెడుతున్న స్మార్ట్ మీటర్ల ద్వారా ఆరువేల కోట్లు
భారం పడుతుందని పేర్కొన్నారు. 200 యూనిట్లు వినియోగించే వారికి స్మార్ట్
మీటర్లు పెడతామంటున్నారని, ఒక్కో మీటరు 13 వేల నుండి 14 వేల వరకూ ఖర్చవుతుందని
అంటే సుమారు పదివేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడుతుందని తెలిపారు. 1.20
కోట్ల మంది వినియోగదారులకు మీటర్లు పెట్టడం వల్ల వినియోగదారులకుగానీ,
డిస్కమ్లకుగానీ ఉపయోగం లేదని పేర్కొన్నారు. విదేశీ కంపెనీలతో జాయింట్
వెంచర్ నిర్వహిస్తున్న అదానీ, అంబానీలకు ఉపయోగమని వివరించారు. ప్రజల నుండి
భారాల పేరుతో వసూలు చేసేమొత్తాన్ని వారికి కట్టబెడుతున్నారని వివరించారు. ఇవి
కాకుండా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఏడాదికి మూడు వేల నుండి ఐదువేల కోట్లు భారం
విధిస్తున్నారని పేర్కొన్నారు.