విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మే
పరిస్థితి లేదని, ప్రజలు ఆయన కంటే తెలివిగా ఆలోచిస్తున్నారని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు
ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు. తన గొంతునే మొత్తం
ప్రతిపక్షం గొంతుగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే తాను పోరాటం
చేస్తున్నట్లు చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నట్టు నటించే అందరి నియంతల చరిత్రలు
ఇదే మాదిరిగా ఉంటాయని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారని అన్నారు.
8 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్
8 లక్షల కోట్ల భారీ పెట్టుబడి తో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు
కానున్నట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో
భారతదేశం గ్లోబల్ హబ్ గా అవతరించాలని, గ్రీన్ హైడ్రోజన్, దాని ఉప ఉత్పత్తులు
ఉత్పత్తి చేయడం, వాటిని వినియోగించడం, ఎగుమతి చేయడం ఈ మిషన్ లక్ష్యమని
వివరించారు. ఎనర్జీ ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి గల దేశంగా ఎదిగేందుకు,
కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని అన్నారు. జాతీయ గ్రీన్
హైడ్రోజన్ మిషన్ ద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, లక్ష కోట్ల
విలువ గల శిలాజ ఇందనాల దిగుమతులను తగ్గించుకోవచ్చని అన్నారు.
భాతర దేశ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం ఎనలేనిది
భారతదేశ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల సహకారం తెలియజెప్పేందుకే ప్రవాసి భారతీయ దివాస్
నిర్వహించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న
మొత్తం 3 కోట్ల మంది ప్రవాస భారతీయులు మన రాయబారులేనని, వారు సాధించిన విజయాలు
మనల్ని గర్వపడేలా చేస్తున్నాయని అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకెల్లా
అత్యధికంగా ఎన్ఆర్ఐల నుండి భారతదేశానికి 100 బిలియన్ డాలర్లు రెమిటెన్స్
రూపంలో రావడం భారతదేశంపై వారికున్న ప్రేమ, విశ్వాసానికి అద్దం పడుతోందని
అన్నారు. అయితే ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుదారుల చట్ట బద్దతకు
సంబందించి కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ
మంత్రి జయశంకర్ ఓసీఐ కార్డుదారుల సమస్యలపై దృష్టి సారించి వాటిని
పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు.