ఎన్జీటి మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
బయో మెడికల్ వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం
అర్హతలను పరిశీలించి కొత్త ప్లాంట్ లకు అనుమతులు
కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి
వెలగపూడి : రాష్ట్రంలో బయో మెడికల్ వేస్టేజీని అత్యంత కట్టుదిట్టమైన
పద్దతుల్లో వేస్టేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ల ద్వారా నిర్మూలించేందుకు చర్యలు
తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో
గురువారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,68,255 బెడ్స్ తో
13,728 వైద్య సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం
ఏటా 7197 టన్నుల బయో వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. ఈ వ్యర్థాలను
సురక్షిత విధానంలో నాశనం చేసేందుకు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ప్లాంట్
లకు తరలిస్తున్నారని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 బయో మెడికల్
వేస్టేజీ ప్లాంట్ లు పనిచేస్తున్నాయని తెలిపారు.
వైద్య సంస్థల నుంచి వచ్చే బయో మెడికల్ వేస్టేజీని 48 గంటల్లో ట్రీట్ మెంట్
ప్లాంట్ లకు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. బయో వేస్టేజీపై నేషనల్ గ్రీన్
ట్రిబ్యునల్ జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు. వైద్య
సంస్థల సంఖ్య పెరగడం, అదనంగా బెడ్స్ ఏర్పాటు అవుతుండటం వల్ల రాష్ట్రంలో కొత్త
బయో మెడికల్ వేస్టేజీ ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని అర్హతలు ఉంటే కొత్త ప్లాంట్ ల
ఏర్పాటుకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత
ప్రాధాన్యత ఇవ్వాలని, హానికరమైన వ్యర్థాలను సురక్షిత విధానాల్లో నాశనం చేసే
విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాలుష్య
నియంత్రణ మండలి చైర్మన్ సమీర్ శర్మ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్
కుమార్ ప్రసాద్, మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, సీనియర్ ఎన్విరాన్ మెంటల్
ఇంజనీర్ (బయోమెడికల్) కె.ఎ.ఎస్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.