విజయవాడ : కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ నేతృత్వంలో ప్రజల కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలో చిరువోలు గ్రామంలో
మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జనారోగ్య యోజన
కింద దాదాపు 50 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని ఇప్పటికే నాలుగు కోట్ల మంది
పైగా లబ్ధిదారులు చికిత్స పొందారన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3
కోట్ల మందికి పైగా లబ్ధి పొందారన్నారు. గతంలో 60 నుంచి 70 లక్షల మంది మాత్రమే
లబ్ధి పొందారన్నారు. కోవిడ్ సమయంలో 47 కోట్ల జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్ లలో
మహిళలకు 500 రూపాయలు నేరుగా జమ చేసి వారికి అండగా కేంద్ర ప్రభుత్వం
నిలిచిందన్నారు. జ్వాలా పథకం కింద 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు గ్రామీణ మహిళలకు
అందించడం జరిగిందన్నారు. అలాగే జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా 11 కోట్ల మందికి
పైగా కుళాయిలకు కనెక్షన్లు ఇచ్చి మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 11 కోట్ల మంది రైతులకు పారదర్శకంగా డిబిటి ద్వారా
6000 రూపాయల ప్రయోజనం చేకూరుతోందన్నారు. మరుగు దొడ్లు తక్కువగా ఉండి మహిళలు
ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం గమనించి వాటిని అధిగమించేందు కోసం స్వచ్ఛ భారత్
మిషన్ ద్వారా 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి ఆరోగ్య సంరక్షణ చేయడం
జరిగిందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఆరోగ్య సంరక్షణకు
పాటుపడుతున్నామన్నారు. దేశంలో 75 సంవత్సరాలుగా వ్యాక్సిన్ తయారు చేసే
పరిస్థితి లేదని దేశంలో కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి మనదేశంలోని
శాస్త్రవేత్తలను ప్రోత్సహించి 35 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి వ్యాక్సిన్
తయారు చేసేందుకు కృషి చేశారన్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా 220 కోట్ల మంది
ప్రజానీకానికి వ్యాక్సిన్ వేసి మన దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఇదే ఆత్మ నిర్భర్ భారత్ అని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మన దేశం నుండి
98 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఎగుమతి చేశామని 150 దేశాలకు వ్యాక్సిన్ తో పాటు
మందులు కూడా పంపించామన్నారు.
వసుదైక కుటుంబంగా భావించి మన దేశం ఇతర దేశాలను ఆదుకుందన్నారు. దేశంలో 2016
సంవత్సరంలో 387 వైద్య కళాశాలలు ఉండగా నేడవి 648 కి పెరిగినాయన్నారు. 2013-14
లో ఎంబిబిఎస్ సీట్లు 51000 ఉండగా అవి నేడు లక్షకు పైగా చేరుకున్నాయని తద్వారా
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అలాగే పిజి సీట్లు గతంలో
31,000 ఉండేవని నేడవి 64 వేలకు పైగా ఉన్నాయన్నారు. అందరి వికాసంతో
దేశాభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. దేశంలో ప్రతి
గ్రామంలో ఆరోగ్య సంరక్షణ కోసం వెల్నెస్ కేంద్రాలు నిర్మిస్తున్నామని ఇప్పటికే
1.50 లక్షల కేంద్రాలు పనిచేస్తున్నాయని అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,840
కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద గత సంవత్సరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2683 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
కోవిడ్ సమయంలో 3 కోట్లకు పైగా టెలి కన్సల్టేషన్లు జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ఈసీ ఆర్పి-1 కింద 441 కోట్ల రూపాయలు, డిసిఆర్పి-2 కింద 696 కోట్ల
రూపాయల అత్యవసర నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవిష్యత్తులో
కోవిడ్ వంటి మహమ్మారి వలన ఇబ్బంది పడకుండా జిల్లాలోని ప్రయోగశాలలు
నిర్మించేందు కోసం ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్ఫాస్ట్రక్చర్ మిషన్ ద్వారా గత
రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 267 కోట్ల రూపాయలను అదనంగా
మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యపరంగా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే రాష్ట్ర
ప్రభుత్వం నుండి ప్రతిపాదన అందిన పక్షంలో ఇంకా నిధులు కేటాయించేందుకు కేంద్ర
ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మంది పేద
ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం
విజయవంతంగా నడుస్తోందన్నారు. జాతీయ రహదారులు నిర్మాణం తదితర పథకాల కింద మరో
వెయ్యి కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి
కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
తదితరులు పాల్గొన్నారు.