వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి సహాయం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు,
సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ముందుకు పాలన తెచ్చిందని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వలంటీర్
వ్యవస్థ ఏర్పాటుతో పరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సోషల్ మీడియాలో
గురువారం ఈ అంశంపై రాసిన వ్యాసంలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు.
ప్రభుత్వానికీ ప్రజలకు వారధిగా నిలుస్తున్న వలంటీర్ వ్యవస్థ గురించి జనం
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని
సేవలను మధ్యదళారుల అవసరం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ వలంటీర్లు
చక్కగా నిర్వహిస్తున్నారని. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య
ప్రజానీకానికి ఈ వలంటీర్ల వ్యవస్థ ఎనలేని మేలు చేస్తోందని అన్నారు. దీంతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్
ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదాభిప్రాయం బలపడుతోందని
అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న
వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవవేతనం) కింద ఏటా రూ.1200 కోట్లు
ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. కనీస విద్యార్హతతో, పారితోషికంతో పనిచేసే
వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టిందని, వచ్చే నెల 15తో ఈ వ్యవస్థ
ప్రవేశ పెట్టి నాలుగేళ్లు పూర్తవుతుందని అన్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఈ కొత్త
వ్యవస్థ పనితీరును నిస్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే
వస్తాయని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు
ప్రజలకు నిజమైన సేవలందించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్ర పోషిస్తున్నారని
అన్నారు. ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే
వ్యవహరిస్తున్నారు కానీ, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం
ప్రతినిధులుగా కాదని అన్నారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వలంటీర్ల
పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోందని
సామాన్య జనానికి వారి సేవలకు గుర్తింపుగా దాదాపు రెండు వందల యాబై కోట్ల
విలువైన నగదు అవార్డులు ఇస్తోందని అన్నారు. 2019 అక్టోబర్ లో ప్రారంభించిన
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా ఈ వలంటీర్లు
పనిచేస్తున్నారని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి
ప్రభుత్వాధికారులు వ్యూహాలు రూపొందిస్తుంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు
చేస్తున్నది వలంటీర్లేనని విజయసాయి రెడ్డి తెలిపారు.
ప్రవేశపెట్టిన వెంటనే పట్టాలెక్కిన కొత్త వ్యవస్థ
అధికార వికేంద్రీకరణ, ప్రజల ముంగిటకే పాలన అన్న గొప్ప లక్ష్యంతో ప్రవేశ
పెట్టిన వెంటనే పట్టాలెక్కి గ్రామ, వార్డు వలంటీర్ల ఆశించిన దాని కన్నా ఎక్కువ
వేగంతో ముందుకు సాగిందని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలకంగా
వ్యవహరించే దాదాపు పదిహేను వేల మందికి పైగా గ్రామ, వార్డు కార్యదర్శులు తోడు
కావడంతో వలంటీర్ల వ్యవస్థ మరింత చలనశీలంగా సాగుతోందని అన్నారు. ఈ సచివాలయ,
వలంటీర్ల వ్యవస్థలు కనీవినీ ఎరగని రీతిలో ఎన్నో రకాల సేవలను ప్రజల గుమ్మం
ముందుకే తీసుకొచ్చాయని అన్నారు. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు
ప్రభుత్వోద్యోగుల కాళ్లావేళ్లా పడే అవసరం లేకుండా ప్రభుత్వ సంక్షేమ
కార్యక్రమాల ఫలాలు అందుకోవడం కొత్త వ్యవస్థలు విజయవంతమయ్యాయని చెప్పడానికి
గొప్ప నిదర్శనమని అన్నారు. ప్రతి వేయి కుటుంబాలకు సేవలందించే సచివాలయ
వ్యవస్థకు వలంటీర్ల వ్యవస్థ తోడవడంతో అచిరకాలంలోనే ఆశించిన ఫలితాలు వచ్చాయని
అన్నారు. వాటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని అన్నారు. తెలంగాణలో
కూడా అధికార వికేంద్రీకరణకు ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలనే ఆలోచన వచ్చిందని
తెలుస్తోందని అన్నారు. తమిళనాడు సైతం గ్రామ సచివాలయాల ఫక్కీలో గ్రామీణ
ప్రాంతాల్లో 600కి పైగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు 2022లో
ప్రకటించిందని తెలిపారు. వాటిలో పాలనా సౌకర్యాలు, సమావేశ మందిరాలు ఉండేలా
చూడాలని తమిళ సర్కారు యోచిస్తోందని చెప్పారు. ఎవరెన్ని వివాదాలు లేవనెత్తినా
పాతికకు పైగా ఉన్న ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మాత్రం వలంటీర్లు కీలక
పాత్ర పోషిస్తున్నారనేది తిరుగులేని వాస్తవమని అన్నారు. పూర్తిస్థాయి ప్రభుత్వ
ఉద్యోగులు కాకపోయినా ప్రజల అవసరాలు తీర్చడంలో వలంటీర్లు ముందుంటున్నారని జనం
ఇవే అవసరాల కోసం ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన దుస్థితిని వలంటీర్ల
వ్యవస్థ ద్వారా వైఎస్సార్సీపీ సర్కారు తప్పించిందని అన్నారు. వలంటీర్ వ్యవస్థ
ఏర్పాటుతో సామాన్య ప్రజానీకానికి సాధికారత లభించిందని విజయసాయి రెడ్డి
వివరించారు.