తీర ప్రాంత యువత భవితకు ‘డిజిటల్ కమ్యునికేషన్ భవన్’ మణిహారం
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సందర్శన
పీఎం లంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రం పరిశీలన
అమరావతి : పరుల హితం కోరి చేసే మంచి పనులకు భగవంతుడి పూర్తి ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. తీరప్రాంతంలో ఇంత పెద్ద డిజిటల్ భవనం అందుబాటులోకి రావడం యువత భవిష్యత్ కు ఓ మణిహారంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం లంక లాంటి మారుమూల ప్రాంతంలో ఈ స్థాయి భవన నిర్మాణం చేపడుతున్నపుడు ఇక్కడ నిజంగా అంత అవసరమా అని అనుకున్నామన్నారు. కానీ, ఈ భవన సముదాయం అందుబాటులోకి రావడం వల్ల చుట్టుపక్కల కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అనతి కాలంలోనే 1,500 యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణను ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయడం, ఉపాధి అవకాశాలు పొందిన కాల్ లెటర్స్ అందజేయడం అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సామాన్య ప్రజల పట్ల చూపే ప్రేమకు ఒక ఉదాహరణే ఈ అధునాతన డిజిటల్ భవనం అన్నారు. చేతి వృత్తుల వారికి సమాజంలో ఎన్నో ఇంబ్బందులు ఉంటాయని, ఆ ఇబ్బందులను తొలగించడానికి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పి యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతంలో డిజిటల్ కమ్యూనిటీ భవనం రాష్ట్రంలోని నైపుణ్య శిక్షణ భవనాలలో మోడల్ గా నిలుస్తుందన్నారు. విశాఖపట్నంలో నౌకలు, పడవలు తదితర వాటిని తయారీ, మరమ్మతులకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల వంటివి యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయన్నారు. కోవిడ్-19 కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు టెస్ట్ లు, మందులను ఇచ్చి ఆదుకోవటం సహా రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కేంద్ర సహకారం.. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సహకారం మరువలేనిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చిన కేంద్ర మంత్రితో మంత్రి బుగ్గన విమానశ్రయంలో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లి తొలుత పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించుకుని కేంద్ర మంత్రితో కలిసి ప్రత్యేక పూజలలో భాగస్వామ్యమయ్యారు. అనంతరం పరమేశ్వరి అమ్మవారి అలంకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజీన్నర బరువుతో చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి అలంకరించేందుకు వేదపండితులకు కేంద్ర మంత్రి సమర్పించారు. అనంతరం అమ్మవారి కిరీటానికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం పర్యటనలో భాగంగా స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సహా సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు , స్థానిక బీజేపీ నేతలతో ఆమె ముచ్చటించారు.అనంతరం పీఎం లంకలో ‘పీఎం విశ్వకర్మ నైపుణ్యంతో దేశం యొక్క నవ నిర్మాణ కల్పన’ కార్యక్రమంలో యువతో మాట్లాడారు. డిజిటల్ కమ్యునికేషన్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక యువత శ్రీసిటీ సెజ్, భీమవరంలోని సంస్థలతో శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందినందుకు ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి సంబంధిత సెర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీడాప్ సీఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.