లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార భాజపా తన సన్నద్ధత
వేగాన్ని పెంచింది. సీట్ల కేటాయింపు కోసం అంతర్గత కసరత్తు మొదలు పెట్టింది.
పార్టీ టికెట్లు ఇవ్వడానికి ఉండాల్సిన అర్హతలను, పాటించాల్సిన విధి విధానాలను
ఖరారు చేయడంపై దృష్టి సారించింది. ఢిల్లీలో సమావేశమైన కీలక నేతలు సిట్టింగ్
ఎంపీల పని తీరును సమీక్షించినట్లు తెలిసింది. వివిధ ఏజెన్సీల నుంచి
క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకొని, అంతర్గత సర్వే వివరాలతోనూ పోల్చి
చూస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేందుకు వివిధ అంశాలను
పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవలం పనితీరునే
కాకుండా నేతల వ్యక్తిత్వం, సామాజిక మాధ్యమాల్లో వారి ఫాలోయింగ్‌నూ
పరిశీలిస్తున్నట్లు కొందరు నేతలు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం
చూపలేని నాయకులకు టికెట్ నిరాకరించి వారి స్థానంలో రాజ్యసభ నుంచి కేంద్ర
మంత్రులుగా ఎంపికైన వారికి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రాతినిధ్యం
వహిస్తున్న వారికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. మరోవైపు గత సార్వత్రిక
ఎన్నికల్లో పరాజయం పాలైన 166 స్థానాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే
అధిష్ఠానం చర్యలు చేపట్టింది. ఆ లోక్‌సభ నియోజకవర్గాలన్నింటినీ 40
క్లస్టర్లుగా విభజించి, వాటి బాధ్యతలను కొందరు కేంద్ర మంత్రులకు, సీనియర్
నాయకులకు అప్పగించింది.
పేరు మార్పుతో పాపాలు మాసిపోవు : విపక్షాలు తమ కూటమి పేరును యూపీఏ నుంచి
ఇండియాగా మార్చుకున్నప్పటికీ వాటి అవినీతి, దుష్పరిపాలన పాపాలు మాసిపోవని
ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతానికి
చెందిన 45 మంది ఎన్డీయే ఎంపీలతో నిర్వహించిన భేటీలో ఆయన ప్రసంగించారు. వచ్చే
లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ
బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే ఎంపీలతోనూ ప్రధాని
సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్
గడ్కరీ, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులు కూడా ఆ భేటీల్లో
ప్రసంగించారు.
కన్యాకుమారి, కోయంబత్తూరులలో ఒక స్థానం నుంచి మోడీ పోటీ : దక్షిణాది
రాష్ట్రాల్లో బలోపేతంపై భాజపా చురుగ్గా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.
కేరళలో కన్నా తమిళనాడు, తెలంగాణలలో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుండడంతో
ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణతో ఈ రెండు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ
లోక్‌సభ స్థానాలను గెలవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పార్టీ వర్గాల
సమాచారం. దీనిలో భాగంగా ప్రధాని మోడీ ఈ దఫా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో
కాకుండా తమిళనాడులోని కన్యాకుమారి లేదా కోయంబత్తూరు నుంచి పోటీ చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సంస్థాగతంగా
కూడా భాజపా బలంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే
విజయం సాధించారు. ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనను
ఆర్ఎస్ఎస్ కూడా ఆమోదించినట్లు సమాచారం.