విజయవాడ : అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు మహిళలను అరెస్ట్ చేస్తున్న తీరును పరిశీలించేందుకు వెళ్ళిన విలేకరులు, ఫోటోగ్రాఫర్లపై విజయవాడ డీసీపీ విశాల్ గున్ని నాయకత్వంలో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్థన్, విజయవాడ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, ఆర్.సూర్యకిరణ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, సామ్నా రాష్ట్ర ప్రధానకార్యదర్శులు ఏచూరి శివ, సీహెచ్.రమణారెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన విజయవాడ నగరంలో నిత్యం అనేక సమస్యలపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటారని, వీటిని కవర్ చేయడం, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మీడియా బాధ్యత అన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఫొటోలు తీస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడడం వారి అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. గతంలో అనేక పెద్ద ఉద్యమాలు జరిగిన సందర్భాల్లో కూడా విజయవాడలో పోలీసులు ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడిన ఘటనలు లేవన్నారు. ఫోటోగ్రాఫర్ల విధులను అడ్డుకోవడం, వారిని పోలీస్ వ్యాన్లు ఎక్కించి భయపెట్టే చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ప్రజాశక్తి ఫోటోగ్రాఫర్ రామును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని, మరో ఫోటోగ్రాఫర్ రమణపై పోలీస్ ఉన్నతాధికారి సమక్షంలో దౌర్జన్యం చేయడం, మీడియా అయితే ఏమిటంటూ చులకనగా మాట్లాడటంపై యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే మీడియాపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.