రాష్ట్ర సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి
వెలగపూడి : సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వారి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్విహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పిలుపునిచ్చారు.75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు.భారత గణతంత్ర దినోత్సవ వేళ సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ వారివారి విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు.1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా అప్పటికి మనకు రాజ్యాంగం లేక 1935 నాటి బ్రిటిష్ చట్టాన్ని అనుసరించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేస్తూ 1947 ఆగస్టు 29న రాజ్యాంగం నిర్మాణం కోసం డా.బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.1947 నవంబరు 4న కానిస్టిట్యుయెన్స్ అసెంబ్లీని ఏర్పాటు చేయగా 24 నెలల్లో రాజ్యాంగ ముసాయిదాను రూపొందించగా అది ఆమోదం పొంది 1950 జనవరి 26 నుండి భారత దేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడి ఆనాటి నుండి మన భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిందని సిఎస్ జవహర్ రెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు.అంతేగాక 1950 జనవరి 24న మన జాతీయ గీతాన్నిఆమోదించడం జరిగిందని అదే విధంగా 1950 జనవరి 25న భారత ఎన్నికల కమీషన్ ఏర్పాటు అయిందని అందుకే ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని సిఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గానే కాకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వెలుగొందుతోందని,మన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి సమాన హక్కులను కల్పించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.రిపబ్లిక్ అంటే మనల్ని మనం పరిపాలించుకునే వ్యవస్థని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించు కోవడం ద్వారా తనకు నచ్చిన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ స్వాతంత్యాన్ని రాజ్యాంగం కల్పించిందని అన్నారు.రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగి మన రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా పనిచేసి ప్రజలకు మెరుగైన రీతిలో పనిచేసి ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాల ఫలాలు పేదలందరికీ సక్రమంగా అందేలా అన్ని విధాలా కృషి చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి పిలుపు నిచ్చారు.
ఈకార్యక్రమంలో సచివాలయ ముఖ్య భద్రతాధికారి కె.కృష్ణమూర్తి,జిఏడి ఉప కార్యదర్శి రామసుబ్బయ్య, శ్రీనివాస్,సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామి రెడ్డి, ఎస్పిఎఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, డా.కుమార్,పలువురు ఇన్స్పెక్టర్లుఇతర పోలీస్ సిబ్బంది,సచివాలయ అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.