చాగల్లులో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న
హోంమంత్రి
కొవ్వూరు : అర్హులైన ప్రతి ఒక్కరికి నూరు శాతం పథకాలు అందించాలనే లక్ష్యంతో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషిచేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి,
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ఇప్పటికే
రాష్ట్రంలో 99 శాతం మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన ఒక్క శాతం
అర్హులకు కూడా జగనన్న సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందన్నారు. శనివారం చాగల్లు మండలం చాగల్లులో సచివాలయం-1, సచివాలయం-2
పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా
హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకున్న
లబ్ధిదారులకు చాగల్లు-1 నుండి 1534 ధృవపత్రాలు, చాగల్లు— నుండి 1422
ధృవపత్రాలను హోంమంత్రి తానేటి వనిత అందించారు. ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి
వనిత మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి మరిన్ని
సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి
గ్రామంలోనూ ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయని.. చిన్న చిన్న కారణాల వలన,
సాంకేతిక లోపం వలన, పథకాలపై పూర్తి అవగాహన లేకపోవడం వలన లబ్ది చేకూరని పక్షంలో
జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మిగిలిన కుటుంబాలకు కూడా లబ్ది చేకూరుతుందని
తెలిపారు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో
ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం
చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా 11 రకాల ధ్రువీకరణ
పత్రాలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందిస్తున్నామని, వాటిని ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి
పథకాలే కాదు వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్లు కూడా ఇస్తారన్నారు. అనంతరం
ప్రతి చిన్న సమస్య, ఇబ్బందిపై వచ్చిన వినతులను ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా
పరిశీలించారు. చిన్న చిన్న ఇబ్బందులను సంబంధిత అధికారులు వెంటనే
పరిష్కరించాలని ఆదేశించారు. మౌలిక వసతులు, సాంకేతికపరమైన ఇబ్బందులు తదితర
అంశాలపై వచ్చిన వినతులపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. జలజీవన్ మిషన్
ద్వారా ఇంటింటికీ కుళాయిని అందరికీ ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే
పనులు ప్రారంభమయ్యాయని.. ఇవి పూర్తికావడానికి కొంత సమయం పడుతుందన్నారు.
ఇంటింటికీ కుళాయి వచ్చేంత వరకూ అవసరమైన ప్రతిఒక్కరికీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు
అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ప్రతి
సేవ వారికి అందించేందుకు వీలుగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని.. జగనన్న
సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా చూడాలని
హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక
ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ
సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.