అమరావతి : “ ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ
అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ
ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన
వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని
జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31
లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు
ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా,
నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు.
వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు
రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన
అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే. అప్పు పెరుగుదలని పోల్చి
చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound
Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర అప్పు CAGR 19.02
% పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు
చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో
(జూన్ 2019 నుంచి మార్చి 2023) కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37%
పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది తప్ప మీరు చెప్పినట్టు కాదు.
మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా
లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే ప్రజలను
కాపాడుకోవడానికే. తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష
కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే
తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం. సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్
జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే. అప్పులపై
వడ్డీ చూస్తే 2022 – 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక
మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు
వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు
లేవని ప్రజలు గమనిస్తున్నారు.