విజయవాడ : ప్రతి శుక్రవారం నివాసాలలో డ్రైడే పాటించడం ద్వారా దోమల వృద్దిని
అరికట్టవచ్చని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు అన్నారు. 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో దోమల నియంత్రణపై ప్రజలకు
విస్తృత అవగాహన కల్పిస్తూ నిర్వహించిన డ్రై డే ర్యాలీలో ఆయన ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల ఉత్పత్తి కేంద్రాలను ఎలా గుర్తించాలి, వాటిని
ఎలా నివారించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్థానికులకు వివరించారు. అనంతరం
మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎక్కువ రోజులు ఇళ్లల్లో నీటిని నిల్వ ఉంచకూడదని
సూచించారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని.. కనుక
గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులు, కుండీలలో కనీసం మూడు
రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలన్నారు. కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి
వస్తువులు ఇళ్ల పరిసరాల్లో ఉంచకుండా చూడాలని పేర్కొన్నారు. డెంగీ, మలేరియా,
చికెన్ గున్యా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే
నియంత్రించే దిశగా వీఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కడా
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని
సూచించారు.
అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్
సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దోమలు నియంత్రణకు ప్రతీరోజు
ఫాగింగ్ చేయాలన్నారు. హోటల్స్, తినుబండారాల బండ్ల వద్ద అపరిశుభ్ర పరిస్థితులు
లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో
విజయవాడ నగరం ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని, తొలి స్థానమే లక్ష్యంగా
ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ఇందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని
వెల్లడించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అంబేద్కర్, డీఈలు గురునాథం,
రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ కర్నాటి
నరసింహారావు, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, నాయకులు బెజ్జం రవి,
పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, కనపర్తి కొండా,
సామంతపూడి గోవిందరాజు(చిన్నా), సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు
పాల్గొన్నారు.