విజయవాడ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం
వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 29 వ డివిజన్ 209 వ
వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక
కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
మల్లంపల్లి వారి వీధి, బావి రోడ్డు, తుంగం కోటేశ్వరరావు వీధి, ములక్కాయల వారి
వీధులలో విస్తృతంగా పర్యటించి 320 గడపలను సందర్శించారు. గత చంద్రబాబు అవినీతి
పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని బుక్ లెట్ల ద్వారా
స్థానికులకు వివరించారు. సంక్షోభం తప్పా సంక్షేమం ఎరుగని రీతిలో గత తెలుగుదేశం
పాలన చతికిలపడిందని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వం అన్ని వర్గాల జీవన
ప్రమాణాలు, స్థితిగతులు మెరుగుపర్చడం కోసం విశేషంగా కృషిచేస్తోందన్నారు. ఈ
సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. కూలిన సైడ్ డ్రెయిన్ల
పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.
చంద్రబాబుకు ప్రచార పిచ్చి పట్టింది
ప్రతిపక్ష నేత చంద్రబాబుకి ప్రచార పిచ్చి పట్టిందని ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలకు సంబంధించి
మృతుల కుటుంబాలు రోడ్డున పడ్డా.. ప్రతిపక్షనేతలో కనీసం పశ్చాత్తాపం, కనికరం
లేకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా ఆ పాపాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం
చేస్తున్నారని మండిపడ్డారు. చట్టంపైన, పోలీసులపైన చంద్రబాబుకు కనీస గౌరవం
లేదని మల్లాది విష్ణు ఆరోపించారు. కుప్పంలో పోలీస్ అధికారులపై దౌర్జన్యానికి
పాల్పడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇరుకు సందులు,
రోడ్ల పైన మీటింగ్ లు పెట్టవద్దని జీవో ఇస్తే.. ఆ జీవోను అగౌరవపరిచేలా
మాట్లాడటం బాబుకు తగదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి..
చట్టాలను ఉల్లంఘించడాన్ని మల్లాది విష్ణు తప్పుబట్టారు. పైగా చంద్రబాబు
చేసింది తప్పని ఖండించే పరిస్థితుల్లో జనసేన, బీజేపీ, వామపక్షాలు లేకపోవడం
సిగ్గుచేటన్నారు. కందుకూరు, గుంటూరు మరణాలకు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ
పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ జి.సుజనా, నాయకులు
ఎస్.కె.బాబు, కోలా రమేష్, కంభం కొండలరావు, సముద్రపు గోవింద్, చీమల గోవింద్,
అక్బర్, మానం వెంకటేశ్వరరావు, బెజ్జం రవి, కొంగితల సుధాకర్, దేవినేని సుధాకర్,
పూర్ణిమ, నాగమణి, జి.వాసు, మోహన్ రావు, దేవినేని శివాజీ, ఇతర నాయకులు, అన్ని
శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.