డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు కృషి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల : రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, అందుకనుగుణంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందన్‌వెళ్లిలో జున్నా సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే గృహావసరాలకు సరిపోయే విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని, తద్వారా కరెంటు ఛార్జీల భారం తగ్గుతుందన్నారు. 2030 నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టు ప్రత్యామ్నాయ ఉత్పత్తిని పెంచుకునేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు ముందుకు వస్తే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జున్నా సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ శేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు అనిల్‌బాబు, బస్వీరెడ్డి, నరేందర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేతలు నర్సింహారెడ్డి, భీంభరత్ తదితరులు పాల్గొన్నారు.