త్వరలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ కార్యక్రమానికి శ్రీకారం
వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
ప్రజా సమస్యలు, విభజన హామీలపై పోరాటం చేస్తాం
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
న్యూఢిల్లీ : వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు
గిడుగు రుద్రరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన తర్వాత
ఏపీలో కాంగ్రెస్ దెబ్బతిందన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు
చూసి ప్రజలు కాంగ్రెస్ వస్తేనే మంచిదని భావిస్తున్నారన్నారు. ఈనెల 9న ఏపీసీసీ
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. కాంగ్రెస్ అనేక సంస్కరణలను
తీసుకొచ్చిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి
ఉందని స్పష్టం చేశారు. త్వరలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ పేరట కార్యక్రమం
నిర్వహిస్తామని గిడుగు రుద్రరాజు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు
అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని గిడుగు రుద్రరాజు
అన్నారు. తమ పోరాటం రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీపై అని స్పష్టం
చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి దొరుకుతుందన్నారు.
రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చే
అంశంపై తొలి సంతకం చేస్తామన్నారని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు గుర్తు చేశారు.
ప్రజా సమస్యలు, విభజన హామీలపై పోరాటం చేస్తాం : పార్టీని బలోపేత చేయడానికి
కృషి చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతామని, ప్రజా సమస్యలు,
విభజన హామీలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ
గుర్తింపు ఉంటుందని, ప్రధానంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు.
సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు.
కార్పొరేషన్ ఛైర్మన్గా, ఎమ్మెల్సీగా, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా,
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం పార్టీ
ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, పార్టీని బలోపేతం
చేయడానికి కృషి చేస్తానన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి మంచి ఆదరణ
పెరుగుతోందని అన్నారు. పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని
గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.