విజయవాడ : వ్యవసాయ ఆధారితంగా మన దేశంలో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన
బిజెపి ప్రభుత్వం వాటిని అమలుచేయడానికి ముందుకు రాలేకపోయిందని ఆంధ్ర ప్రదేశ్
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడుతూ ఛలో రాజ్‌భవన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు
కృతజ్ఞతలు తెలిపారు. కానీ నిరసన కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు కలిసి కుట్రపూరితంగా అడ్డుకున్నాయని ఆరోపించారు. గౌతమ్
అదానీకి కట్టబెడుతున్న దేశ సంపదలను, పోర్టులు, స్టీల్ ప్లాంట్, ఎయిర్
పోర్ట్‌లు, పవర్ ప్రాజెక్ట్‌లు, అంబానీ, ఆదానీలకు ధారాదత్తం చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గుర్తించి వచ్చే
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.
ప్రపంచంలో 16వ స్థానంలో వున్న గౌతమ్ అదానీ రెండవ స్థానంలోకి చేరారంటే ప్రధాని
నరేంద్ర మోడీ కారకులని ఆరోపించారు. జీవీకే, జీఎంఆర్ బ్రహ్మాండమైన అభివృద్ధి
ప్రాజెక్టులను ప్రజలను సౌకర్యవంతమైన ఏర్పాట్లను చూస్తున్నారని వారిని
కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిని
నీరుకారుస్తూ, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, మార్గదర్శి సంస్థపై దాడులు
వీటికి నిదర్శనమని గిడుగు రుద్రరాజు అన్నారు. అవినీతి, అక్రమాలు, కక్ష సాధింపు
చర్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా
సంక్షేమానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి
డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రూ.4వేల కోట్లను ఎడమ, కుడి కాలువలకు నిధులు
మంజూరు చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానిని ఎన్నిసార్లు
కలిశారు, ఎన్నిసార్లు రాష్ట్రం గురించి మాట్లాడారన్న విషయంపై శ్వేతపత్రం
విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటి యూపీఏ
ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ పోలవరం అథారిటీ ఏర్పాటు చేసి నిపుణులతో కమిటీ
వేయించారని తెలిపారు. తెలుగు వారు అన్ని రంగాలలోను ప్రపంచ స్థాయిలో పేరు
ప్రతిష్టలు తెచ్చిపెట్టినారని ప్రశంసిస్తూ, కీరవాణి, చంద్రబోస్‌లకు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. విలేకరుల
సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ,
ఏఐసిసి సభ్యులు కొలనుకొండ శివాజీ, విజయవాడ నగరాధ్యక్షుడు నరహరశెట్టి
నరసింహరావు, ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు మేడా
సురేష్, తదితరులు పాల్గొన్నారు.