దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
అయోధ్య నుంచి రాగానే కొత్త పథకం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి రాగానే ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. ‘ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా మోడీ ప్రకటించారు. సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం శక్తిని పొందుతుంటారు. ఈరోజు అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారత్ స్వావలంబన దిశగా పయనించేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.