విశాఖపట్నం : ఈ నెల 12 న విశాఖపట్నంలో జరగనున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బహిరంగ సభ విశాఖలో ఎప్పటికీ ఓ చరిత్రగా నిలవాలని, ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అమర్ నాథ్ లో కలిసి బహిరంగ సభ ఏర్పాట్ల, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు.
ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కల్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన ఉందని చెప్పారు. బహిరంగ సభ వద్ద త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. సభా ప్రాంగణం వద్ద వైద్య బృందాలు, అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉండాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విశాఖ నగరానికి ప్రజలు వాహనాల్లో వస్తారని ఈ మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. బహిరంగ సభకు చేరుకునే వాహనాల పార్కింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 11 వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు విశాఖ చేరుకుంటారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతారని తెలిపారు. ప్రధాని రాత్రికి నేవీ గెస్ట్ హౌస్ లో బస చేసి 12 వ తేదీ ఉదయం బహిరంగ సభకు హాజరవుతారని అన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ణయించిన విధంగా ముందుగా 7 అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో ముందుగా ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, అనంతరం ప్రధాని మాట్లాడుతారని తెలిపారు. ఈ మేరకు అధికారులంగా ఏర్పాట్లపై పూర్తి అప్రమత్తతతో ఉండాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, పోలీస్ కమీషనర్ శ్రీకాంత్, జివిఎంసి కమీషనర్ రాజాబాబు ఏర్పాట్లపై, ఇతర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నెడ్ క్యాప్ చైర్మెన్ కేకేరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.