గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. అరుదైన వ్యాధి బారిన పడిన
ఆమె నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటూ జీవన పోరాటం సాగిస్తోంది. రుమేసా గెల్గీ
టర్కీలోని సఫ్రన్బోలు జిల్లాలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 26
సంవత్సరాలు. ఎత్తు ఏడు అడుగుల 0.7 అంగుళాలు. దాంతో ఆమె ప్రపంచంలోనే ఎత్తయిన
మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. కేవలం ఎత్తయిన
మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొడవైన వేళ్లు, వెన్నెముక కలిగిన మహిళగా ఆమె
పేరిట మొత్తం ఐదు ప్రపంచ రికార్డులున్నాయి. అయితే ఓ వైపు కష్టాలను
ఎదుర్కొంటూనే చదువులో రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడి పలువురికి స్ఫూర్తిగా
నిలుస్తోంది.అంతెత్తు ఎలా : రుమేసా నాలుగు నెలల చిన్నారిగా ఉండగానే ఆమె వీవర్స్
సిండ్రోమ్ బారిన పడింది. ఇది జన్యుపరమైన సమస్య. అంటే ఎముకల్లో విపరీతమైన
పెరుగుదల కన్పిస్తుంది. ముఖం, పాదాలు ఎక్కువగా సాగిపోతాయి. గొంతు కూడా సాగడం
వల్ల బొంగురుగా వినిపిస్తుంది. ఆ వ్యాధి మెదడు పైనా ప్రభావం చూపిస్తుంది.
కండరాలు వదులుగా ఉంటాయి. వీవర్స్ సిండ్రోమ్ కారణంగా రుమేసాకు 6 ఏళ్లు
వచ్చేసరికే 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు పెరిగింది. దాంతో పెద్దల శరీరంలో ఓ
చిన్నారిని అమర్చినట్లుగా ఆమె రూపం ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి
బారినపడిన వారు 50 మంది మాత్రమే ఉన్నారట.
నిత్యం బతుకు పోరాటం : అరుదైన వ్యాధి కారణంగా రుమేసా నిత్యం బతుకు పోరాటం
చేయాల్సి వస్తోంది. గుండె పనితీరులో లోపం బయటపడింది. ఎత్తు కారణంగా ఆమె
వెన్నెముక ఒక వైపు వంగిపోయింది. దాంతో నడక కూడా కష్టంగా మారిందామెకు. అవసరం
మేరకు వైద్యులు కొన్ని చోట్ల రాడ్లు, స్క్రూలు అమర్చారు. ఫలితంగా రుమేసా
విద్యాభ్యాసమంతా ఇంటి వద్దే సాగింది. అందువల్ల ఆమె బాల్యం అందరిలా లేదు. కనీసం
స్నేహితులతో ఆడుకోవడం కూడా కుదర్లేదు. అయినప్పటికీ రుమేసా కుంగిపోలేదు.
తియ్యని మాటలతో ఎంతో మందిని తనకు దగ్గరయ్యేలా చేసుకుంది. వారితో కబుర్లు
చెబుతూ కాలం గడిపేస్తోంది.
విమానంలో మార్పులు చేశారు : రుమేసా బాగా పొడుగ్గా ఉండటంతో కారులో
ప్రయాణించలేదు. అందుకే ప్రత్యేకంగా వ్యాన్‌ను సిద్ధం చేశారు ఆమె కుటుంబ
సభ్యులు. ఎక్కువ సేపు కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందులోనే పడుకొని
వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇక విమానంలో ప్రయాణించడం కూడా కష్టమే. 6 సీట్లను ఓ
స్ట్రెచర్లా మార్చి రుమేసా ప్రయాణాన్ని సులభతరం చేసింది టర్కిష్ ఎయిర్ అనే
విమానయాన సంస్థ.
వెబ్ డెవెలపర్గా రాణిస్తోంది : తన జీవితాంతం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ
రుమేసా చదువును నిర్లక్ష్యం చేయలేదు. దాంతో ఆమెకు కాలిఫోర్నియాలో వెబ్
డెవెలపర్గా ఉద్యోగం వచ్చింది. తన దిన చర్య, పర్యటనల వివరాలను రుమేసా ఇన్‌స్టా
ఖాతాలో పోస్టు చేస్తుంటుంది. ఆకారాన్ని బట్టి మనుషులను అంచనా వేసే మనస్తత్వం
మార్చుకోవాలని ఆమె పిలుపునిస్తోంది. అనేక షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ
పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది