అపారవనరులు, అనుకూల పరిస్థితులు, ఏపీ ప్రత్యేకత ప్రతిబింబించాలని మంత్రి ఆదేశం
విశాఖలో జరిగే సదస్సుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రులు బుగ్గన
రాజేంద్రనాథ్, గుడివాడ అమర్ నాథ్
అమరావతి : ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అంతర్జాతీయ పెట్టుబడల
సదస్సు నిర్వహించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశ్రమల శాఖ
ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత, అపార వనరులు, అనుకూల
పరిస్థితులు సదస్సులో ప్రతిబింబించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ తో
పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ప్రభావితం చెందేలా సదస్సు ఉండాలని ఆయన
పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలోని
రెండో బ్లాక్ లోని సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సదస్సుపై
మంత్రులు బుగ్గన, అమర్ నాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సదస్సుకు సంబంధించిన
సన్నాహక ఏర్పాట్లతో పాటు బ్రాండింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు.
పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్థిక
మంత్రి పేర్కొన్నారు. సమావేశ మందిరాలు, వేదిక ఏర్పాట్లు సహా సదస్సుకు
సంబంధించి మౌలిక సదుపాయాల ఏర్పాటులో పాటించాల్సిన కీలక అంశాలను ఆర్థిక మంత్రి
చర్చించారు. రంగాల ప్రాధాన్యత, నేపథ్యం, లోగోకు సంబంధించి ఆర్థిక మంత్రి
బుగ్గన పలు కీలక సూచనలిచ్చారు. మార్చి 3,4 తేదీలలో నిర్వహించే గ్లోబల్
ఇన్వెస్ట్ మెంట్ సదస్సుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుకూలంగా ఉంటుందని పరిశ్రమల
మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఇటీవల ఆవిష్కరించిన లోగో, నేపథ్యాలను పరిశ్రమల శాఖ మంత్రి
గుడివాడ్ అమర్ నాథ్ ఆర్థిక మంత్రికి వివరించారు. ఇతర రాష్ట్రాలు పెట్టుబడుల
సదస్సులను నిర్వహిస్తోన్న తీరును పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు
చర్చించారు. అతిథులకు అందించే మర్యాదపూర్వక జ్ఞాపికలలోనూ ఆంధ్రప్రదేశ్
ప్రత్యేకత చాటే వస్తువులు, ప్రత్యేకంగా రూపొందించిన బొమ్మలకు పెద్దపీట
వేయాలని పరిశ్రమల మంత్రి ఆదేశించారు. ఏఏ దేశాల్లో ఎప్పుడు నిర్వహించాలన్న
తేదీలను ఖరారు చేసి రోడ్ షోల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని పరిశ్రమల శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ తెలిపారు. కేంద్ర మంత్రులను
ఎవరెవరిని ఆహ్వానించాలి? ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ప్రఖ్యాత కంపెనీల సీఈవోలను,
ఆయా రంగాలలో ప్రత్యేకతను చాటిన వ్యక్తులను ఎవరెవరిని పిలవాలన్న అంశాలపై
మంత్రులు అధికారులకు పలు సూచనలిచ్చారు. విశాఖ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ
పెట్టుబడుల సదస్సుపై బుధవారం జరిగిన మంత్రుల సమీక్షలో పరిశ్రమల శాఖ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి
కె.సునీత పాల్గొన్నారు.