ఘనంగా బాస్టీల్ దినోత్సవం
గౌరవ అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ
పారిస్: ‘‘ప్రపంచ చరిత్రలో భారత్ బాహుబలిలాంటిది. భవిష్యత్‌లోనూ నిర్ణయాత్మక
పాత్ర పోషించబోతోంది’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్
ప్రశంసించారు. మానవ జాతి చరిత్ర గతిని మార్చిన పద్దెనిమిదో శతాబ్ది ఫ్రెంచ్
విప్లవ ప్రతీకగా ప్రతి ఏటా జులై 14న జరిగే ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఈసారి
భారతీయతను సంతరించుకుంది. పారిస్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలకు భారత
ప్రధాని నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఐరోపాలోనే అతిపెద్ద కవాతుగా
పేరుగాంచిన బాస్టీల్ డే పరేడ్‌లో భారత సైనికులూ పాల్గొన్నారు. సారే జహాసె
అచ్చా అంటూ వీనులవిందుగా వాయిద్యం హోరెత్తుతుంటే 269 మందితో కూడిన భారత
త్రివిధ దళాల బృందం ఫ్రెంచ్ సైనిక దళాలతో కలిసి కవాతు చేసింది. ఫ్రాన్స్
వాయుసేనతో కలిసి భారత్‌కు చెందిన రఫేల్ విమానాలూ ఝుమ్మంటూ వేడుకకు ఆకాశంలో
రంగులద్దాయి. భారత సైనిక బృందం పరేడ్‌కు రాగానే మోడీ లేచి నిల్చొని సెల్యూట్
చేశారు.
మన బంధం మరింత బలపడాలి : మోడీ ఉద్వేగంగా స్పందించారు. ‘‘ఈ చరిత్రాత్మక
బాస్టీల్ డే వేడుకలో అద్భుత అతిథ్యమిచ్చినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. మాకు
నమ్మకమైన, బలమైన భాగస్వామిగా ఉంటూ వస్తున్న ఫ్రాన్స్‌కు 140 కోట్ల మంది
భారతీయులు సదా కృతజ్ఞులై ఉంటారు. ఈ బంధం మరింత బలపడాలని కోరుకుంటున్నాను’’ అని
మోదీ స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా ఇందుకు
ప్రతిస్పందించారు. ‘‘ప్రపంచ చరిత్రలో బాహుబలిలాంటి భారతావని భవిష్యత్‌లోనూ
నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. మాకు వ్యూహాత్మక భాగస్వామేకాకుండా మంచి మిత్ర
దేశం కూడా. మా జాతీయ దినోత్సవానికి భారత్‌ను గౌరవ అతిథిగా ఆహ్వానించటాన్ని
గర్వంగా భావిస్తున్నాం. మా వాయుసేనతో కలిసి భారత రఫేల్ విమానాలు ఆకాశంలో
విహరిస్తుంటే తొలి ప్రపంచయుద్ధంలో ఫ్రాన్స్, భారత సైనికుల పోరాటం
గుర్తుకొస్తోంది. వాటిని ఎన్నడూ మరచిపోలేం’’ అని మెక్రాన్ అన్నారు. మొదటి
ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయుల తరఫున బరిలోకి దిగిన భారత సైనికులు ఐరోపా,
ఆఫ్రికాల్లో ఫ్రాన్స్‌కు ఎన్నో విజయాలు అందించారు.
సంయుక్తంగా యుద్ధ విమానాల ఇంజిన్ల అభివృద్ధి : రక్షణ ఉత్పత్తుల రంగంలో తమ
సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని భారత్-ఫ్రాన్స్‌లు నిర్ణయించాయి. యుద్ధ
విమానాలు, హెలికాప్టర్ల ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత
నౌకా దళం కోసం మూడు స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్టులపై
అవగాహనకు వచ్చాయి. ప్రధాని మోడీ మెక్రాన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం అధ్యక్ష
భవనం వద్ద నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే, నౌకా దళానికి
అవసరమైన 26 రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయనుందనే విషయమై ఎలాంటి
ప్రకటన వెలువడలేదు. ఘనమైన లక్ష్యాలతో భారత్-ఫ్రాన్స్ మధ్య రాబోయే 25 ఏళ్లకు
సంబంధించిన వ్యూహాత్మక బంధానికి మార్గసూచీని సిద్ధం చేస్తున్నట్లు మోదీ
ప్రకటించారు. ‘‘భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.
మరో 25 ఏళ్ళకు మార్గసూచీ తయారు చేస్తున్నాం. ఫ్రాన్స్‌తో బంధంలో రక్షణ సహకారం
ప్రధానమైంది. ఇరుదేశాల పరస్పర నమ్మకానికి ఇది ప్రతీక. భారత్ చేపట్టిన
ప్రతిష్ఠాత్మక మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాల్లో ఫ్రాన్స్
కీలక భాగస్వామి. ఉగ్రవాదంపై పోరులోనూ సమష్టిగా నడుస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో
పేర్కొన్నారు. హెలికాప్టర్ ఇంజిన్లు, విడిభాగాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల
సదుపాయాలను ఫ్రెంచ్ కంపెనీలు భారత్‌లోనే ఏర్పాటు చేసేలా చర్చలు సాగుతున్నాయని
మోడీ తెలిపారు. రెండు దేశాల చమురు కంపెనీలైన ఐఓసీ-టోటల్ మధ్య కూడా దీర్ఘకాల
ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో సహకారంపైనా మంతనాలు
కొనసాగుతున్నాయి. రక్షణ రంగానికి చెందిన ఇరుదేశాల పరిశోధన సంస్థల మధ్య
సహకారానికి సంబంధించి కూడా ఒప్పందాలు కుదిరాయి. ప్యారిస్‌లోని భారత దౌత్య
కార్యాలయంలో డీఆర్డీఓ టెక్నికల్ ఆఫీస్‌ను భారత్ ఏర్పాటు చేయనుంది.