బాక్సింగ్ చరిత్రలో భారత్ మరో మైలురాయిని చేరుకోనుంది. త్వరలో జరగబోయే ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు ఇండియా ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఢిల్లీ వేదికగా వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై IBA అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్, BFI ప్రెసిడెంట్ అజయ్ సింగ్ సంతకాలు చేశారు. ఈ వివరాలను వారు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భారత్ లో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జరగనుండటంపై IBA వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. స్వదేశంలో ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపింది. టోర్నీ నిర్వహించడం వల్ల భారత్‌లో బాక్సింగ్‌కు మరింత ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.