వెలగపూడి : మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి
తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్ పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ
పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ను రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్
అడ్వాన్సుమెంట్, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా అభినందించారు, ఆమె లక్ష్యం
నెరవేరాలని ఆకాంక్షించారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం రెండో బ్లాక్
లో తన చాంబరులో నున్న మంత్రి ఆర్.కె.రోజాను ప్రముఖ పర్వతారోహకురాలు ఆశామాలవ్య
బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. దేశవ్యాప్తంగా సైకిల్ పై తాను చేస్తున్న
సైకిల్ యాత్ర లక్ష్యాన్ని మంత్రి ఆర్.కె.రోజాకు ఆమె విరించారు.
ఈ సందర్బంగా మంత్రి ఆర్.కె.రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతకు, మహిళా
సాధికారత సాధనకు జనగన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఆమెకు
వివరించారు. కిశోరబాలికలు ఎటు వంటి ఆటంకం లేకుండా తమ విద్యను కొనసాగించేందుకు
వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే నాణ్యమైన న్యాప్కిన్లు,
నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో టాయిలెట్ల అభివృద్ది, నిర్వహణ, మహిళల
రక్షణ, భద్రతకై దిశా యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో పాటు అన్ని
రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు తదితర కార్యక్రమాలను ఏపీ
ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు మంత్రి ఆశా మాలవ్యకు
వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత, సాధికారత అంశాలు అమోఘం
ఈ సందర్బంగా ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య మాట్లాడుతూ తాను
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన జాతీయ
క్రీడాకారిణి అని, సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత
ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని,
నవంబర్ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించి ఇప్పటివరకు ఏపీ సహా 8
రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తిచేయడం జరిగిందని
మంత్రికి ఆమె వివరించారు. తన సైకిల్ యాత్రకు ఆంద్రప్రదేశ్ లో మంచి ఆధరణ
లభించిందని, అటు వంటి ఆధరణ తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా లభించలేదని
ఆమె మంత్రి రోజాకు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్,
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాను మర్యాధపూర్వకంగా కలిసినపుడు
వారు ఎంతగానో తనను ఆధరించారని, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని ముఖ్యమంత్రి
ప్రకటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి నేతృత్వంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, సాధికారత సాధనకు
అమోఘమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె అభివర్ణించారు. మహిళల భద్రత కోసం ఏపీ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్ పనితీరు అమోఘంగా ఉందని, ఆ యాప్ ను తాను
కూడా డౌన్ లోడ్ చేసుకుని పరిశీలించడం జరిగిందని, పోలీసుల ప్రతిస్పందన చాలా
బాగుందని ఆమె అభినందించారు.