ఆస్కార్ నాయకత్వంలో కమిషనర్ జె.నివాస్ ను కలిసిన బృందం
అమరావతి : ఐ.ఎన్.టి.యు.సి అనుబంధ ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల
సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వైద్య
ఆరోగ్యశాఖ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ తీర్మానాలను సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఆస్కార్ రావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం సోమవారం ప్రభుత్వం దృష్టికి
తీసుకెళ్ళింది. ఇందుకు సంబందించిన వివరాలను సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి
జి.వి.వి.ప్రసాద్ పత్రికల వారికి వివరించారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న
రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేకానేక
ప్రధాన సమస్యలను గురించి మహాసభలో చర్చించి చేసిన తీర్మానాల ప్రతిని వైద్య
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ కు మంగళగిరి లోని వారి
కార్యాలయంలో అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎంతో ప్రతిష్టాత్మకంగా
భావించి తమ ఆత్మ గౌరవ సభగా జరుపుకున్న మహాసభ తీర్మానించిన సుమారు 26
తీర్మానాల ప్రతిని అందజేసి, ఒక్కొక సమస్య విషయాన్ని సమగ్రంగా కమిషనర్ కు
ఆస్కార్ వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో
పరిష్కరించేలా ప్రభుత్వానికి కమిషనర్ ద్వారా తెలియపర్చడం జరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ
తో కలిసి ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆస్కార్ రావు,
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా సాహెబ్, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ బాబు
తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.