గోపాలపురం : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని, ప్రజా సేవకులని తెలిపారు. గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం 262 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. కరగపాడు సచివాలయానికి చెందిన బాలిన స్వామి కి సేవా వజ్ర అందజేయగా.. అలాగే సేవారత్న పొందిన వాదాలకుంటకు చెందిన విభిన్న ప్రతిభావంతుడు వాలంటీర్ పెద్దిరాజు స్టేజీ కింద ఉండగా.. వారి వద్దకు వెళ్లి ఆయనను హోంమంత్రి తానేటి వనిత సన్మానించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందించడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా మూడవ ఏడాది వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రధానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలన్నారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో, గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను అందించడం జరుగుతోందన్నారు. వాలంటీర్లు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలు అందించాలని హోంమంత్రి సూచించారు. అవార్డుల ప్రదానోత్సవం లో భాగంగా సేవా వజ్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 30 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 20 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుంది. సేవా మిత్ర కింద సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్ తో పాటు 15 వేల రూపాయల నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను హోంమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ధికారులు, నాయకులు, గ్రామ, వార్డు సచివాలయాల కోఆర్డినేటర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.