నెల్లూరు : నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార పార్టీయే టార్గెట్గా
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలదాడి ప్రారంభించారు.
కోటంరెడ్డి భద్రతను కుదిస్తూ ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం ఉపసంహరించడంపై ఆయన
తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో
ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాల్సింది పోయి నలుగురిలో ఇద్దరు గన్మెన్లను
వెనక్కు పిలిపించుకోవడం ఏమిటని మండిపడ్డారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలు
ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను మానసికంగా
ఇబ్బంది పెట్టాలని నిర్ణయించినట్టు ఈ ఘటనతో అర్థవుమవుతోందని వ్యాఖ్యానించారు.
తన అదనపు గన్మెన్లను ఉపసంహరించుకున్న ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ కింద
మిగిలిన ఇద్దరు గన్మెన్లను తిరిగి ఇచ్చేస్తున్నానని కోటంరెడ్డి
పేర్కొన్నారు. మనకు బహుమతి ఇచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కనీస
సంస్కారమని అన్నారు. తనది ప్రజల గొంతుకని, తన స్వరం రోజురోజుకూ పెరుగుతుందే
కానీ తగ్గదని స్పష్టం చేశారు. భద్రత తగ్గించినంత మాత్రాన తాను బలహీనపడనని
తేల్చి చెప్పారు. ప్రజల పక్షానే నిలబడతానని స్పష్టం చేశారు.