గుంటూరు : ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆల్ టైం
రికార్డు సృష్టించిందని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 2019 వరకు ఉన్న
ప్రభుత్వ ఉద్యోగులు 3.97 లక్షల మంది కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
2,06,368 మంది ప్రభుత్వ ఉద్యోగాల పొందినట్లు రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా
వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. రాష్ట్రంలో 53 వేల మంది ఆర్టీసీ
కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని అన్నారు.
దిక్కుతోచని స్థితిలో టీడీపీ : తెలుగుదేశం పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో
ఇద్దరు లోకేష్ యువగళం పాదయాత్రకు డుమ్మా కొట్టగా, రోజుకు రూ.1000 ఇవ్వకుంటే
పాదయాత్రకు హాజరుకాలేమని పార్టీ కేడర్ మెరాయిస్తున్న పరిస్థితి టీడీపీకి
దాపురించిందని అన్నారు. అలాగే చంద్రబాబు పార్టీకి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
అసలు ఎమ్మెల్యే అభ్యర్థులే దొరకడం లేదని అన్నారు. ఇలాగ డబ్బుతో చంద్రబాబు
రాజకీయాలను ఎంతకాలం బ్రష్టు పట్టిస్తారని మండిపడ్డారు.
ఏపీలో భారీగా పెరిగిన ఆదాయపన్ను చెల్లింపుదారులు : ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ పన్ను
చెల్లింపుదారులు సంఖ్య గణనీయంగా పెరిగిందని, దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి
వర్గాల ఆదాయాలు గణనీయంగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. -2020-23
మధ్య ఆదాయ పన్ను చెల్లింపుదారులు సంఖ్య ఏకంగా 18 లక్షలకు పెరగడం శుభపరిణామమని
అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోనే ఆదాయ
పన్ను చెల్లింపు దారుల సంఖ్య అత్యధికంగా పెరిగినట్లు నివేదికల్లో వెల్లడైనట్లు
తెలిపారు.
ఇతర దేశాల జైళ్లలో మగ్గుతున్న భారతీయుల్ని విడిపించేందుకు కేంద్రం సత్వర
చర్యలు చేపట్టాలి : ఇతర దేశాల్లో ఖైదు చేయబడ్డ అమాయకపు భారతీయుల్ని
విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి
కోరారు. ఏఏ దేశాల్లో ఎంతెంత మంది భారతీయులు ఖైదు చేయబడ్డారో మొదట
తెలుసుకోవాలని అన్నారు. అందులో ఎంత మంది అమాయకులు ఇరుక్కున్నారు, ఎవరెవరు
న్యాయ సహాయం పొందుతున్నారో తెలియాలని అన్నారు. ఇటీవల లిబియా దేశంలో ట్రిపోలి
జైల్లో ఖైదు చేయబడిన 17 మంది అమాయకపు భారతీయుల్ని క్షేమంగా వెనక్కి
తీసుకురావడంతో కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయమని అన్నారు. కొన్ని ట్రావెల్
ఏజన్సీలు చేసిన మోసం కారణంగా ఈ యువకులు లిబియా దేశంలో ఖైదు చేయబడ్డారని ఆయన
తెలిపారు.