రాజ్‌భవన్ ముట్టడి నన్ను బాధించింది
కార్మికుల ప్రయోజనాలకు నేను వ్యతిరేకం కాదు
తెలంగాణ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు
సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ కోరారు.
‘‘ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల
ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్
ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు.
పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?’’ అని రాష్ట్ర
ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత,
ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు. ప్రభుత్వం నుంచి తక్షణమే
సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్ భవన్
వెల్లడించింది. మరోవైపు గవర్నర్ కోరిన వివరణలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో
రాజ్‌భవన్‌కు వివరణ పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
మీకోసమే నేనున్నా : ‘మీ సమస్యల పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను.
రాజ్‌భవన్ ముట్టడి నన్ను బాధించింది. కార్మికుల ప్రయోజనాలకు నేను వ్యతిరేకం
కాదు. నేనెప్పుడూ కార్మికుల వైపే ఉంటాను. గత సమ్మె సమయంలోనూ కార్మికులకు అండగా
నిలబడ్డాను. కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికే బిల్లును సమగ్రంగా
పరిశీలిస్తున్నాం’ అని తమిళిసై ట్వీట్ చేశారు. అనంతరం కేసీఆర్ సర్కార్‌కు 5
ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు.
ఆ ఐదు అంశాలు ఏంటంటే : 1. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు,
లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు. 2. రాష్ట్ర విభజన
చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో
లేవు. 3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని
చెబుతున్న ప్రభుత్వం… వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం,
కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని
ప్రశ్నించిన గవర్నర్. 4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో
సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని
ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్. 5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్
లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్
లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా
స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్. ఈ లేఖకు పైవిధంగా
కేసీఆర్ సర్కార్ స్పందించింది.
గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ : తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై
గవర్నర్ తమిళిసై లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ నిశితంగా వివరణ
ఇచ్చింది. శనివారం ఉదయం ఆర్టీసీ విలీనంపై విధివిధానాల విషయంలో వివరణ ఇవ్వాలని
రాష్ట్ర ప్రభుత్వానికి 5 ప్రశ్నలతో కూడిన లేఖను గవర్నర్ పంపారు. దీనిపై
స్పందించిన ప్రభుత్వం 5 సందేహాలకు వివరణ ఇస్తూ తిరిగి లేఖ రాసింది.
కార్పొరేషన్ కన్నా మెరుగైన వేతనాలు ఉంటాయని సర్కార్ లేఖలో వివరించింది.
విలీనం తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని ప్రభుత్వం
లేఖలో స్పష్టం చేసింది. అయితే రాజ్‌భవన్ నుంచి ఇంతవరకూ అక్నోలెడ్జెమెంట్
ఇవ్వడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేఖపై రాజ్‌భవన్ నుంచి ఎలాంటి
రియాక్షన్ వస్తుందా అనేదానిపై కేసీఆర్ సర్కార్, ఆర్టీసీ ఉద్యోగుల్లో సర్వత్రా
ఆసక్తి నెలకొంది. సో.. ఇక మిగిలిందల్లా ప్రభుత్వం ఇచ్చిన వివరణను నిశితంగా
పరిశీలించి గవర్నర్ ఆమోద ముద్ర వేయడమే.news description