కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
మచిలీపట్నం : ప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు
కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం
నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్
డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ. కిషోర్, కే ఆర్
ఆర్ సి. ఎస్ డి సి నారాయణరెడ్డిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ
ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులను
పిలిపించి వారు అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని
సూచించారు. తొలుత జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నవరత్నాలు “తదితర పలు పథకాలకు సంబంధించి
నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
ఇందులో ఏమాత్రం రాజీపడరాదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో బిబిఎల్ నుండి స్లాబ్ వరకు అన్ని
దశల్లో ఎప్పటికప్పుడు పురోగతి సాధించి నిర్ణీత లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
ఎవరు కూడా ముందస్తు అనుమతి లేనిదే సెలవులో వెళ్ళరాదని ముఖ్యంగా వాట్సాప్ ల
ద్వారా సందేశాలు పంపి సెలవుల్లో వెళ్లడం సరికాదని స్పష్టం చేశారు.
ఏదైనా అత్యవసరమైతే సంయుక్త కలెక్టర్ కు గాని, డిఆర్వో కు గాని తెలియజేసి
సెలవులో వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఏదేని ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో
వెనుకబడరాదని స్పష్టం చేస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే
అధిగమించేందు కోసం సంయుక్త కలెక్టర్ ను, లేదా డిఆర్ఓ ను లేదా తనను
సంప్రదించాల్సి ఉంటుందన్నారు. పథకాల లక్ష్యాల సాధనలో అన్ని విధాల సహకారం
అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు తాను జిల్లా అధికారులతో ఉదయం 9:30 కు 35
ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వెనుకబడిన
ప్రభుత్వ శాఖల్లో పురోగతి సాధించేందు కోసం సూచనలు జారీ చేస్తామన్నారు. అత్యవసర
సమయాల్లో ఫోన్ కాల్ చేసిన లేదా వాట్సాప్ ద్వారా సంయుక్త కలెక్టర్, డిఆర్ఓ,
కలెక్టరేట్ నుండి పంపించే సందేశాలు, కోరే వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలించి
సకాలంలో స్పందించి సమాధానాలు తెలపాలని సూచించారు.
స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అందజేసిన కొన్ని అర్జీల వివరాలు ఇలా
ఉన్నాయి:
బాపులపాడు మండలం తేలప్రోలు గ్రామస్తులు సోమిశెట్టి నాగ పార్వతీశ్వరమ్మ తనకు
80 సంవత్సరాల వయస్సని, తన భర్త కుమారులు చనిపోయారని, చల్లపల్లి మండలంలో ఉన్న
తన కూతురు వద్ద నివాసం ఉంటున్నానని, తనకు ఇదివరకు వస్తున్న వృద్ధాప్య పించను
జనవరి 2023 తో ఆగిపోయినదని, ఆధారపడి జీవిస్తున్నానని, ఎన్నిసార్లు అడిగిన
పింఛన్లు పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అర్జీని అందజేశారు. మొవ్వ
మండలం బాట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన చలసాని సుబ్బారావు తన గ్రామంలో
నాణ్యత లోపంతో ఉపాధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర నిధులు సద్వినియోగం చేయాలని
కోరుతూ ఫిర్యాదును అందజేశారు. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామం కొత్తపాలెంకు
చెందిన గోవాడ కోటేశ్వరమ్మ తాను ఎస్సీ వ్యవసాయ కూలీనని, తనకు లేఔట్ లో గృహం
మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
మండల కేంద్రమైన ఉయ్యూరుకు చెందిన సామాజిక కార్యకర్త జంపాల శ్రీనివాస్ గౌడ్
కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో సర్వే నంబరు 94 లో గల 3501 ఎకరాల
గ్రామపంచాయతీ, అటవీ భూములను అధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు
వ్యతిరేకంగా ఆక్రమించుకొని చెరువులను తవ్వి సాగు చేస్తున్నారని, లోకాయుక్త
ఉత్తర్వుల మేరకు వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని అవినీతికి పాల్పడుతున్న
అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కోడూరు మండలం
వడ్రపాలెం గ్రామానికి చెందిన వేముల ఏడుకొండలు తనకు 65 సంవత్సరాల వయస్సని,
వృద్ధాప్య పింఛన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి వృద్ధాప్య పింఛన్
మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ జ్యోతి బసు, డి
ఆర్ డి ఏ, డ్వామా పిడి లు పిఎస్ఆర్ ప్రసాద్,జి.వి.సూర్యనారాయణడిపిఓ
నాగేశ్వరరావు నాయక్, సిపిఓ శ్రీలత, డి.ఎస్.ఓ పార్వతి, ముడా విసి రాజ్యలక్ష్మి,
డాక్టర్ గీతాబాయి, డిఇఓ తేహెర. సుల్తానా, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత
అధికారి సరస్వతి, బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ
అధికారి ఫణి ధూర్జటి, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ రాజా, జిల్లా
రిజిస్ట్రార్ ఉపేంద్రరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.