సమ సమాజ స్థాపన కోసం పాటు పడిన భక్త కనకదాస ఆశయాలే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు.
అనంతపురం కనకదాస కల్యాణ మండపంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భక్త కనకదాస జయంతి వేడుకలలో మంత్రి ఉష శ్రీ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, కురుబ కార్పొరేషన్ చైర్ పర్సన్ సూర్య ప్రకాశ్ , నాటక అకాడెమీ చైర్ పర్సన్ హరిత, ఏడీసీసీ బ్యాంకు చైర్ పర్సన్ లిఖిత, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు వాసంతి, కోగటం భాస్కర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముని తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఉష శ్రీ మాట్లాడుతూ బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని నమ్ముతూ వెనకబడిన తరగతుల పల్లకీ మోస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాగరికత నిర్మాతలైన బీసీలు ఈరోజు నాగరికతకు దూరం అవకుండా వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పాటు పడుతున్నారన్నారు. అదే విధంగా జిల్లాలోని కురుబలకు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటూ స్థానికంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించారన్నారు.
కనకదాస దృష్టిలో ఒక కులం ప్రతినిథిగా ఉండటం అంటే సమాజ శ్రేయస్సు కోసం, అంకిత భావంతో పని చేయడమేనన్నారు.
భగవంతుడు అందరికీ సమానమేనని చాటి చెప్పినవారిలో ప్రథముడు కనకదాస అని ఎంపీ కృష్ణయ్య పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అందుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు పొందాలనే ఆలోచనతో అధికార పార్టీ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు.
బీసీల కోసం ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని ఎమ్మేల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.. జనాభా ప్రాతిపదికన చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం కల్పించాలనే ఆలోచనతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బీసీలను ఎమ్మెల్యే, ఎంపీలను చేశామన్నారు. శాసనసభలోనే గాక మంత్రివర్గంలో సైతం బీసీలకు సముచిత స్థానం కల్పించే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వెనకబడిన కులాలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
కర్ణాటకలో జన్మించినప్పటికీ మానవాలికంతటికీ పూజ్యుడైన విద్వాంసుడు, సంగీత కళాకారుడు కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.
అంతకుముందు పాతూరు లోని కనక దాస విగ్రహానికి మంత్రి ఉష శ్రీ చరణ్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.