ముందుకొచ్చింది. అసైన్డ్, అభ్యంతరం లేని ఇతర ప్రభుత్వ స్థలాలు, అర్బన్
సీలింగ్ భూములను అధీనంలో పెట్టుకున్న వారికి, వివిధ సంస్థలకు నిబంధనల మేరకు
వాటిపై హక్కులు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల
స్వీకరణ ప్రారంభించారు. 125 చదరపు గజాలలోపు స్థలాలు ఉన్న పేదలకు ఉచితంగా,
అంతకన్నా ఎక్కువ విస్తీర్ణమైతే మార్కెట్ ధరకు ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది.ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలు
అందించేందుకు సర్కారు మరో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు
ప్రక్రియను ప్రారంభించింది. మీ-సేవా కేంద్రాల ద్వారా అర్హులైన వారు దరఖాస్తు
చేసుకోవచ్చు. ఆక్రమణదారులు 2014 జూన్ 2 తేదీలోపు సంబంధిత స్థలంలో నివాసం
ఏర్పాటు చేసుకుని ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం సవరించింది. 2020 జూన్ రెండో
తేదీలోపు వారి ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
గత నెల 17న విడుదల చేసిన కొత్త జీవో 29 ప్రకారం దరఖాస్తులు చేసుకునేందుకు
వీలుగా ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో జీవో 58, 59 పోర్టల్‌ను తిరిగి
తెరిచింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ అంశంపై కలెక్టర్లతో దృశ్య మాధ్యమ
సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం 58, 59 ఉత్తర్వుల కింద
గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. ఇంతకు ముందు
క్రమబద్ధీకరణ చేయించుకోని వారికి అవగాహన కల్పించాలని సీఎస్ కోరారు. సింగరేణి
గనులు ఉన్న ప్రాంతాల్లో ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకూ సర్కారు అవకాశం
కల్పించింది.
పేదలకు ఉచితంగా : గతంలో జీవో 76 కింద క్రమబద్ధీకరణ నిర్వహించినట్లుగానే..
తాజాగా దరఖాస్తులు స్వీకరించి మరోమారు పట్టాలు అందజేయనున్నారు. గతంలో సరైన
ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు
సైతం తాజా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రక్రియలో జూన్ 2 2020లోపు నివాసం ఉన్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణకు
అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకు అంతకుముందు ఆ స్థలంలో నిర్మాణం
చేసుకుని నివాసం ఉంటున్నట్లు ఆధారం చూపాల్సి ఉంటుంది. ఇంటి పన్ను, ఇంటి నంబరు
రసీదులు, నల్లా పన్ను, విద్యుత్ బిల్లు లాంటివి ఆధారాల కింద దాఖలు చేయాలి.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లాంటివి దరఖాస్తుతో పాటు
జత చేయాలి. 125 గజాల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించుకున్న వారికి జీవో 59 ప్రకారం
మార్కెట్ ధర లెక్కిస్తారు. 126 నుంచి 250 గజాల వారు రిజిస్ట్రేషన్ ధరలో 50
శాతం చెల్లించాల్సి ఉంటుంది.